నిజానికి అందరు స్టార్స్ బిజీనే. కానీ ఒకేసారి ఒకేసమయంలో పలు బాధ్యతలను నెత్తికెత్తుకోవడం అందరి వల్లా కాదు. ఏవైనా ప్రత్యేక ఆఫర్లు వచ్చినా ప్రస్తుతం తాము ఫలానా షూటింగ్‌లో బిజీగా ఉన్నామని చెబుతూ ఉంటారు. కానీ కింగ్ నాగ్ ప్రత్యేకతే వేరు. ఆయన ప్రతి విషయాన్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తాడు. ఒకవైపు తానే హీరోగా ‘మన్మథుడు2, బంగార్రాజు’ ఒప్పుకున్నాడు. తానే నిర్మాతగా ‘మన్మథుడు 2’లో బిజీగా ఉన్నాడు. అక్కడే చెట్టుకి కట్టుకుని జిమ్ వర్కౌట్స్‌ని చేస్తున్నాడు. మరోవైపు నాగచైతన్య, అఖిల్‌ల కెరీర్. మరోవైపు యాడ్స్. మరోవైపు కోడలికి దారి చూపాల్సిన కొత్త బాధ్యత. పలు బిజినెస్‌లు. అయినా ఆయనకు మంచి అవకాశం వస్తే ఒకేసారి అనుకున్న ప్లానింగ్ ప్రకారం పదిపనులైనా చేసుకుంటూ వెళ్లడమే ఆయన నైజం. షష్ఠిపూర్తి వయసులో గ్లామర్, ఫిట్‌నెస్ పరంగానే కాదు... వరుస పనులతో కూడా ఆయన బిజీ.
తాజాగా విషయానికి వస్తే తమిళ బిగ్‌బాస్ కోసం నయనతార ఓకే చెప్పిందని సమాచారం. తెలుగులో మాత్రం ప్రతి సీజన్‌కి కొత్తవారిని ఎంచుకోవడంలో పురిటి నొప్పులే పడుతున్నారు. మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ తన ఇమేజ్‌తో బాగా సక్సెస్ చేశాడు. రెండో సీజన్ నాని చేతులకి వచ్చింది. పార్టిసిపెంట్స్ తగవులు, సోషల్‌మీడియా సాక్షిగా ఆర్మీలు పుట్టుకురావడం, షోని తమ వారితో ఫిక్సింగ్ చేసే పరిస్థితి రావడం వంటివి నానిని బాగా ఇబ్బంది పెట్టాయి. దాంతో ఆ ఒత్తిడిని తట్టుకోలేని నాని ఇక ఈ షోకి నో చెప్పాడు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ని అనుకుంటే ‘ఆర్‌ఆర్‌ఆర్’ అన్నాడట. వెంకీ అసలు ఇలాంటివి నాకొద్దు అనేశాడు. విజయ్‌దేవరకొండ, బన్నీలను అనుకున్నా తాము బిజీ అని తప్పుకున్నారట.
తెలుగులో అనుష్కని అడిగితే ఆమె కూడా నో చెప్పిందని, ఎట్టకేలకు నిర్వాహకులు నాగార్జునని ఒప్పించారని సమాచారం. నాగ్ బెస్ట్ ఛాయిస్. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ను అద్భుతంగా రన్ చేశాడు. ఆయన ఎఫెక్ట్ వల్లనో చిరు చేసినా నాగ్ ముందు మెప్పించలేకపోయాడు. ఇక పోతే ఈ కొత్త సీజన్‌లో వివాదాలు లేకుండా అంతే కాకుండా మంచి పార్టిసిపెంట్స్‌ని నిర్వాహకులు ఒప్పిస్తున్నారట. ఇప్పటికే నటి, యాంకర్ ఉదయభాను ఎంపిక అయిందని, ఎలిమినేషన్ వరకు రోజుకి రెండు లక్షల పారితోషికం ఇచ్చేలా ఆమెతో ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. మరి మిగతా వారు ఎవరో తెలియాల్సివుంది...!