ఒకే ఒక్క సినిమాతో యూత్ మొత్తాన్ని పడేసిన అజయ్ భూపతి.. నెక్స్ట్ సినిమా విషయంలో ఎడతెగని సస్పెన్స్ క్రియేట్ అయ్యి ఉంది. RX 100 అంటూ కుర్రకారుని మెస్మరైజ్ చేసిన అజయ్ భూపతి నుండి మళ్ళీ ఎలాంటి సినిమా బయటికి వస్తుందో అని ఎదురు చూస్తున్నారు. ఈలోపు నితిన్‌తో అజయ్ భూపతి సినిమా అంటూ వార్తలొచ్చినా.. పారితోషికాల సమస్యతో ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇక తర్వాత రిచెస్ట్ హీరో అయిన బెల్లంకొండ శ్రీనివాస్‌తో అజయ్ భూపతి తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడని.. ఇక టైటిల్‌గా ‘మహాసముద్రం’ పెట్టారని.. శ్రీనివాస్ సరసన నటించేందుకు అక్కినేని సమంతని సంప్రదిస్తున్నారనే వార్తలొచ్చాయి.
అయితే బెల్లంకొండతో కూడా అజయ్ అడ్జెస్ట్ కాలేక రీసెంట్‌గా అక్కినేని కాంపౌండ్ లోకి అడుగుపెట్టి.... నాగ చైతన్యతో ఆ మహాసముద్రం సినిమాని పట్టాలెక్కించబోతున్నాడనే న్యూస్ మొదలైంది. ఇక చైతుని, నాగ్‌ని కలిసి అజయ్ భూపతి మహాసముద్రం కథ వినిపించాడని, మహాసముద్రం అనే టైటిల్‌లో మహా అనేది హీరోయిన్ పేరని... ఇక సినిమా కథ మొత్తం హీరోయిన్ చుట్టూనే తిరుగుతుందని.. అలాంటి బలమైన కేరెక్టర్ సమంత చేస్తే బావుంటుందని అజయ్ భూపతి చైతూకి జోడిగా సమంతానే ఎంపిక చేయబోతున్నాడనే న్యూస్ నడిచింది. మళ్లీ చైతూ - సామ్ జంట కలిసి నటించబోతున్నట్లుగా వార్తలొచ్చాయి.
తాజాగా అజయ్ - చైతు ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ లేదంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాగ చైతన్య ఇప్పటికే వెంకీమామ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉండడం... తర్వాత మేర్లపాక డైరెక్షన్‌లో మరో సినిమా, అలాగే దిల్ రాజు నిర్మాణంలో మరో మూవీ.. ఇలా చైతు డైరీ మరో రెండేళ్లు ఫుల్‌గా ఉండడంతో.. అజయ్‌తో చైతు ఇప్పట్లో సినిమా చేసే అవకాశం లేదంటున్నారు. మరి నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు చైతు కూడా అజయ్ హ్యాండ్ నుండి జారిపోయాడనే న్యూస్ ఫిలింసర్కిల్స్‌లో హల్చల్ చేస్తుంది.