ఈ మధ్య మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన సినిమా గురించి ఎటువంటి వార్తలు వచ్చాయా అందరికీ తెలుసు. సుకుమార్ చెప్పిన కథ నచ్చలేదో, లేక 1 నేనొక్కడినే వంటి సినిమా ఇచ్చిన దర్శకుడితో మళ్లీ సినిమా ఎందుకులే అని అనుకున్నాడో తెలియదు కానీ.. సుక్కూని వెయిటింగ్ మోడ్‌లోనే ఉంచేశాడు. ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత కూడా ఓ హీరో కోసం అంతకాలం వెయిట్ చేయడం ఇష్టంలేని సుకుమార్.. వెంటనే మెగా హీరో అల్లు అర్జున్‌తో చర్చలు జరిపి, అతనితో సినిమాను అనౌన్స్ చేశాడు. ఇంత వరకు అందరికీ తెలిసిన విషయమే.
అయితే అల్లు అర్జున్‌తో సినిమా ప్రకటించగానే మహేష్ బాబు కూడా పాజిటివ్‌గా స్పందిస్తున్నట్లుగా ‘ఆల్ ద బెస్ట్ సుకుమార్‌గారు’ అంటూ ట్వీటేశాడు. దీంతో తప్పంతా సుకుమార్‌దే అన్నట్లుగా చూడటం మొదలెట్టారు. అయితే తాజాగా జరిగిన ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహేష్ తన మనసులోని మాటను, దర్శకులు తన దగ్గర ఎలా ఉండాలో అనే విషయాన్ని చిన్నపాటి కౌంటర్ రూపంలో తెలియజేశాడు. ముఖ్యంగా సుకుమార్‌కే అనేలా ఈ కౌంటర్ ఉండటం విశేషం.
ఆ కౌంటర్ ఏమిటో మహేష్ మాటల్లోనే.. ‘‘నేను ఏ దర్శకుడిని పేరు పెట్టి పిలవను. వంశీనే (‘మహర్షి’ దర్శకుడు) తొలిసారి పిలిచాను. 10 నిమిషాలు కథవిని, వంశీని పంపించేద్దామని అనుకున్నా. కానీ, వంశీ చెప్పిన కథ 20 నిమిషాలు వినగానే నచ్చింది. ‘2 సినిమాలు చేయడం తర్వాతే కుదురుతుందేమో’ అని తనతో అన్నా. ‘రెండేళ్లయినా వెయిట్ చేస్తా. మిమ్మల్ని తప్ప ఇంకెవర్నీ ఊహించలేను’ అని అన్నాడు. ఆ మాటకు తనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ రోజుల్లో ఏమాత్రం కథలో దమ్మున్నా, హీరో కోసం 2 నెలలు వెయిట్ చేయలేక, వేరే హీరో దగ్గరకు వెళ్తారు. అలాంటిది రెండేళ్లు వెయిట్ చేశాడు వంశీ. ఇక్కడ ఎవరు చేసే పనులు వాళ్లు చేయాలి. నటుడు నటించాలి. దర్శకులు దర్శకత్వం వహించాలి..’’ అంటూ మహేష్ ‘మహర్షి’ వేడుకపై ఎవరికి తగలాలో వారికి తగిలేలా కరెక్ట్‌గా వేశాడని అంతా అనుకుంటున్నారు.