‘పెళ్లిలో శుభం పలకరా నాయనా అంటే.. పెళ్లికూతుర్ని అదేదో అన్నాడట..’ అలా ఉంది జీవితా రాజశేఖర్ తీరు. మా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని, తమ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడానికి పిలిస్తే.. ‘డిగ్రీకాలేజ్’ టీమ్‌కు గడ్డి బాగా పెట్టింది జీవిత. అసలు ఇలాంటి సినిమాల ట్రైలర్ విడుదలకు నేను రాంగ్ పర్సన్‌ని అంటూ పిలిచినవారిని చెంపమీద కొట్టినంత పని చేసింది. నంది అవార్డు విన్నింగ్ డైరెక్టర్ నరసింహనంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిగ్రీకాలేజ్’. ఈ చిత్ర ట్రైలర్‌ను శుక్రవారం జీవితా రాజశేఖర్ విడుదల చేశారు.
ట్రైలర్ విడుదల అనంతరం.. ఇది ఇలాంటి సినిమా అని తెలిస్తే అసలు ఈ వేడుకకు వచ్చేదాన్నే కాదని చిత్రయూనిట్ ముఖం మీదే అనేసింది జీవిత. దీనికి కారణం ట్రైలర్‌లో లిప్‌లాక్‌లు, శృంగార భరిత సన్నివేశాలు ఉన్నాయట. ‘‘అర్జున్‌రెడ్డి, ఆర్.ఎక్స్ 100 పుణ్యమా అని, తెలుగు సినిమాలు ఈ మధ్య లిప్ లాక్ సీన్స్ లేకుండా రావడం లేదు. కాలేజ్ స్టూడెంట్స్ అంటే మేక్ అవుట్స్ లేకుండా, లిప్ లాక్స్ లేకుండా సినిమాలు తీయకూడదు అనే పరిస్థితికి తెలుగు సినిమా దిగజారిపోయిందనుకుంటున్నాను. నేను చూసిన ట్రైలర్‌లో నాలుగైదు షాట్స్ లిప్‌లాక్సే ఉన్నాయి. అలాగే పోస్టర్‌లో కూడా అదే ఉంది..’’ అంటూ ఓ చిన్నపాటి పిట్టకథ కూడా జీవిత చెప్పింది.
ఆ పిట్టకథ ఏంటంటే.. ‘‘మనం ఏదైనా ఇల్లు కట్టుకుంటే బాత్‌రూమ్‌లోనే స్నానం చేస్తాం. బెడ్‌రూంలోనే పడుకుంటాం. హాల్లో స్నానం చేయం. ప్రతి మనిషి జీవితంలో శృంగారం ఉంటుంది. ఉన్నంత మాత్రాన అది ఎక్కడ చేయాలో అక్కడే చేస్తే బాగుంటుంది. పబ్లిక్‌గా రోడ్డుపై చేస్తే అసహ్యంగా ఉంటుంది..’’ అని చెప్పిన జీవిత ఇలాంటి సినిమాలను సెన్సార్ చేయకూడదనే ఓ రూల్ పెట్టాలనిపిస్తుంది (సెన్సార్ సభ్యురాలుగా పనిచేసిందిలే). అయ్యో.. నిర్మాతలు కోట్లు పెట్టారు, సినిమా విడుదల కాకపోతే రోడ్డున పడతారనే జాలితో.. కొన్ని సీన్లు డిలీట్ చేయించి సెన్సార్ చేయిస్తున్నాం.. అని చిన్న సానుభూతి కూడా చూపించిందిలే.
ఇదంతా బాగానే ఉంది కానీ.. రీసెంట్‌గా తన కూతురు శివాత్మిక డెబ్యూ మూవీలో లిప్‌లాక్‌లు ఇరగదీసింది అంటూ వచ్చిన వార్తలకు జీవిత నుంచి ఎటువంటి సమాధానం వస్తుందో. అసలు శివాత్మిక ఒక సినిమా చేస్తుందనే విషయం తెలియడానికి కారణం లిప్‌లాక్సే. మరి అది బాత్ రూమ్‌లో స్నానమో.. బెడ్‌రూమ్‌లో స్నానమో జీవితే చెప్పాలి. ఓవరాల్‌గా ఆమె స్పీచ్ విన్నవారంతా ‘మేము చేస్తే సంసారం, ఎదుటివాళ్లు చేస్తే వ్యభిచారం’ అన్నట్లుగా ఉన్నాయి జీవిత మాటలు అంటూ మాట్లాడుకుంటుండటం విశేషం.