స్త్రీ.. ఆమె లేనిదే అమ్మ లేదు. అసలు సృష్టే లేదు. భగవంతుడైనా ఓ అమ్మకు కొడుకే అనేది తెలుసుకోవాలి. ఆడదంటే ఆడుకునే ఆటబొమ్మ కాదు. ఆమె ఆకాశంలో సగం, సృష్టిలో సగం.. కానీ మహిళ అంటే మనకెప్పుడు చిన్నచూపే. ఆమె ఏ విషయంలోనూ మగాడి కంటే తక్కువ కాదు. ఒక కవి చెప్పినట్లు ఓ మహిళను పలువురు గ్యాంగ్ రేప్ చేస్తే తప్పు చేసిన మగాళ్లని తప్పుపట్టనిలోకం.. బాధితురాలిపైనే నిషేధం విధించి, బహిష్కరిస్తుంది. ఆనాటి ద్రౌపదికి ఈనాటి ఈమె గతికి అసలైన అవమానం చూస్తున్న ఈ లోకంలోని కళ్లది అనేది నగ్నసత్యం. రోజుకో నిర్భయ కేసు జరుగుతుంటే ఈనాడు చలం ఉండి ఉంటే నేటి సమాజంలోని మృగాళ్లపై ఏ స్థాయిలో విరుచుకుపడే వాడో ఊహించలేం.
శబరిమలైలోకి మహిళలను కూడా అనుమతించాలి అంటే మరి మసీదుల సంగతి ఏమిటి? అని ప్రశ్నిస్తారే గానీ మసీదుల్లో కూడా మహిళల ప్రవేశానికి చొరవ తీసుకోరు. దీనికి మన నాయకులు మతం రంగు పులుముతారు. ట్రిపుల్ తలాక్‌పై ఓ విధంగా స్పందించి, మన విషయానికి వచ్చే సరికి మరో విధంగా వితండ వాదం చేసే కుహనా మేథావులు ఎందరో ఉన్నారు. ఇక లైంగిక వేధింపులు అనేవి అన్ని రంగాలలో ఉన్నాయని తప్పించుకోవడానికి వీలులేదు. మొదట సినీ పరిశ్రమ తమ ఇంటిని తాము బాగు చేసుకోవాలి. చిన్మయి వంటి వారిని చంపుతాం.. నరుకుతాం అనే వారికి అంత ధైర్యం చేవలేని మన నాయకుల వల్లనే వస్తోంది. మొత్తానికి మీటూలో అంతా నిజమే లేకపోయినా ఎంతో కొంత వాస్తవం ఉంది. ఈ ఉద్యమం వచ్చిన తర్వాత లైంగిక వేధింపులు చేసే వారు కాస్త భయపడుతున్నారు.
ఇక విషయానికి వస్తే తాజాగా మోదీ తన ఎన్నికల ప్రసంగాలలో మీటుని కించపరుస్తూ అదేదో అద్భుతమైన ప్రసంగంలా ఫీలయ్యాడు. ఆయన మాటలు విన్న సమాజం విస్తుపోయేలా ఆ సభకు వచ్చినవారు కూడా ఆయన వ్యంగ్య వ్యాఖ్యలకు పడీ పడీ నవ్వారు. విషయానికి వస్తే తాజాగా ప్రధాని మోదీ ఇలాంటి వ్యాఖ్యలను చేసిన సందర్భం ఏమిటంటే.. కేంద్ర సర్జికల్ స్ట్రైక్ చేస్తే గతంలో తమ ప్రభుత్వం కూడా ఐదారుసార్లు సర్జికల్ స్ట్రైక్‌లు చేశామని చెబుతూ, మీటూ.. మీటూ అంటున్నారని ఎద్దేవా చేశారు.
దీనిపై చిన్మయి ఘాటుగా స్పందించింది. మీటు అనే పదాన్ని మోదీ ఇలా కామెడీ చేస్తూ మాట్లాడటం సరికాదు. ఇలా ఆ పదాన్ని ఎగతాళి చేసినందుకు బాధగా ఉంది. ఆయన వంటి గౌరవపద స్థానంలో ఉన్న వ్యక్తి అలా మీటూని కామెడీ చేయడం మరీ తీవ్రంగా పరిగణించాలి... అంటూ మోదీ అలా వ్యంగ్యంగా మాట్లాడిన వీడియో, దానితో పాటు సభికులు గట్టిగా నవ్వుతున్న వీడియోలను పోస్ట్ చేసింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మీలాంటి వారు ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఆడవారి మనోభావాలు దెబ్బతీయడం ఏమిటంటూ ఆమె ప్రశ్నించింది. చిన్మయి పోస్ట్‌కి నెటిజన్లు కూడా మద్దతు తెలుపుతున్నారు.