మహేష్ బాబు, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా, అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. మహేష్ బాబు 25వ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్ నిర్మాతలు. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాపంగా భారీగా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా విడుదలను పురస్కరించుకుని హైదరాబాద్ సినీ అభిమానులకు థియేటర్ యాజమాన్యం షాకిచ్చారు.
హైదరాబాద్‌లో రెండు వారాల పాటు టికెట్ల ధరలను పెంచుతున్నట్లుగా వారు తెలియజేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 80 టికెట్‌ను రూ. 110 రూపాయలకు, మల్టీఫ్లెక్స్‌లో టికెట్ రేటుపై రూ.50 అదనంగా పెంచినట్లుగా వారు తెలిపారు. ప్రభుత్వ అనుమతితోనే టికెట్ ధరలు పెంచినట్లు థియేటర్ యాజమాన్యాలు వెల్లడించారు. దీంతో ప్రసాద్ ఐమ్యాక్స్‌లో రూ.138 రూపాయలున్న టికెట్ ధర ఇప్పుడు పెంచిన రేట్లతో దాదాపు రూ.200 కానుంది.
అయితే ఈ పెరిగిన రేట్లపై సినీ అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే పైరసీ ఎక్కువైపోతున్న తరుణంలో ఇలా టికెట్స్ పెంచితే.. సినిమా చూసే వారి సంఖ్య భారీగా తగ్గిపోతుందని, ప్రస్తుతం ఉన్న రేట్లనే కంటిన్యూ చేయాలని నగర ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.