మహేష్‌బాబు సోషల్‌మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండడు గానీ ఆయన శ్రీమతి నమ్రతా మాత్రం ఆ లోటుని తీరుస్తూ పలు విశేషాలతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. గత మూడు నాలుగు రోజులుగా ఆమె మహేష్ ప్రతిష్టాత్మక 25వ చిత్రం ‘మహర్షి’ విడుదల సందర్భంగా మహేష్‌తో కలిసి నటించిన హీరోయిన్లు, దర్శకులతో ఆమె వీడియోలు రూపొందించి సోషల్‌మీడియాలో పెడుతూ ఉంది. ఇది మహేష్ సిల్వర్‌జూబ్లీ ఇయర్ కాబట్టి ఇవి బాగా నెటిజన్లకు కనెక్ట్ అవుతున్నాయి. ఈ వీడియోలలో పలువురు మహేష్‌తో ఉన్న అనుబంధం గురించి, తామంతగా మహేష్‌ని ఇష్టపడేందుకు కారణాలను తెలియజేస్తూ ఈ వీడియోలతో అలరిస్తున్నారు.
ఇప్పటిదాకా ఈ వీడియోలలో జయంత్ సి పరాన్జీ, రాఘవేంద్రరావు, శ్రీనువైట్ల, ఇలియానా, వైవిఎస్‌చౌదరి, బిగోపాల్, గుణశేఖర్, ఎస్.జె.సూర్య, త్రివిక్రమ్, కృతిసనన్, సుకుమార్, శృతిహాసన్, కొరటాల శివ, శ్రీకాంత్ అడ్డాల, మురుగదాస్, కియారా అద్వానీ వంటి వారు మహేష్‌తో తమకున్న అనుబంధం గురించి పంచుకున్నారు. వీరితో పాటు కరణ్‌జోహార్, సమంతలు కూడా మహేష్ గురించి వీడియోలో పంపారు. ‘మహర్షి’ సందర్భంగా ఈ సెలబ్రిటీల ఎగ్జైట్‌మెంట్ ఈ చిత్ర ప్రమోషన్స్‌కి మరింతగా ఉపయోగపడుతుందనే చెప్పాలి.
మరోవైపు ఈ చిత్రంలో నటించిన రాజీవ్‌కనకాల మహేష్ గురించి మాట్లాడుతూ, ‘అతడు’ చిత్రం తర్వాత మరోసారి మహేష్‌బాబు గారితో కలిసి నటంచాను. ‘అతడు’లోని పాత్రతో పోల్చుకుంటే ‘మహర్షి’లో నా పాత్ర ఎంతో భిన్నంగా ఉంటుంది. ఈ సినిమా కోసం మహేష్‌బాబు ఎంతో కష్టపడ్డాడు. ఆయన అద్భుతంగా చేశారని ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చిన్ననాటి నుంచి నటిస్తూనే ఉన్నారు. నటీనటులను, సాంకేతిక నిపుణులను ఆయన ఎంతగానో గౌరవిస్తారు. సెట్స్‌కి వచ్చింది మొదలు తన పని తాను సిన్సియర్‌గా చేసుకుంటూ పోతారు. అందుకే ఆయన సూపర్‌స్టార్ అయ్యారు’ అని చెప్పుకొచ్చాడు.