జనార్ధనమహర్షి, సి.కల్యాణ్ కాంబినేషన్‌లో పిబరే రామరసం..
మే 16న రచయిత, దర్శకుడు జనార్దన మహర్షి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన కొత్త సినిమా విశేషాలను తెలియచేశారు. గతంలో ‘దేవస్థానం’, ‘విశ్వదర్శనం’ చిత్రాలకు దర్శకత్వం వహించారు జనార్దన మహర్షి. కె.విశ్వనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘విశ్వదర్శనం’ చిత్రం విడుదల కాకముందే పలు అవార్డులను సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే. కమర్షియల్ సినిమాలను నిర్మించే నిర్మాణ సంస్థగా పేరున్న నిర్మాత సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించటం విశేషం. ‘పిబరే రామరసం’ ఈ చిత్ర టైటిల్‌గా నిర్ణయించారు దర్శక, నిర్మాతలు.
రామరావణ యుద్ధం జరిగిన వందేళ్ల తర్వాత లంకలోని రాక్షస స్త్రీలు తమ బిడ్డలకు సీతారాముల కథని చెప్పి తర్వాతి తరాలలో రాక్షస గుణాలను ఎలా తొలగొంచారు అనే అంశం మీద ఉండే కథ ‘పిబరే రామరసం’. రాక్షసులు తనివితీరా తాగి, తరించిన రామరసమే ఈ ‘పిబరే రామరసం’ అంటున్నారు జనార్దన మహర్షి. రామాయణ సారంతో తయారవ్వబోతున్న ఈ చిత్రంలోని సీత పాత్రను ఓ ప్రముఖ హీరోయిన్ పోషిస్తున్నారట. త్వరలోనే ఆ విషయాలను తెలియచేస్తామని నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు.