మహర్షి సినిమా హడావిడి ముగిసింది. సక్సెస్ ఫుల్‌గా ఒక వారం పూర్తి చేసుకుంది. ఇక మెల్లగా తమ సినిమాలను బాక్సాఫీసు దగ్గర దింపడానికి దర్శకనిర్మాతలు రెడీ అయ్యారు. ఈరోజు (శుక్రవారం) అల్లు శిరీష్ ఎబిసిడి సినిమా విడుదలైంది. మంచి ప్రమోషన్స్ తో అల్లు శిరీష్ ప్రేక్షకులకు సినిమా మీద ఆసక్తి పెంచాడు. ఇక వచ్చే శుక్రవారం విడుదలకాబోతున్న బెల్లంకొండ - తేజ కాంబో కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ పోషించిన ‘సీత’ సినిమా మీద మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్‌తో సినిమా మీద క్రేజ్ పెంచుతుంది యూనిట్. ఇక సెన్సార్ నుండి క్లిన్ యు సర్టిఫికెట్‌తో భారీగా దిగుతున్న సీత సినిమాతో తేజ హిట్ కొట్టడం ఖాయమంటున్నారు.
మరి ఆ తర్వాత మే 31న తమ సినిమా విడుదల అంటూ గత నెలలోనే ఆడియో వేడుకని నిర్వహించిన సూర్య - సెల్వ రాఘవ్‌ల ‘ఎన్‌జికె’ హడావిడి మాత్రం ఇంకా మొదలవ్వలేదు. కేవలం ఆడియో వేడుకని గ్రాండ్‌గా చేస్తే సరిపోదు. సినిమా మీద క్రేజ్ పెంచాలి అంటే సినిమా ప్రమోషన్స్ ముఖ్యం. కానీ ఎన్‌జికె ప్రమోషన్స్ మాత్రం ఇంకా మొదలవ్వలేదు. విడుదలకు కేవలం 15 రోజుల టైం మాత్రమే ఉంది. కానీ సూర్య చడీ చప్పుడు చెయ్యడం లేదు. ఇక హీరోయిన్స్ సాయి పల్లవి, రకుల్ ప్రీత్ లు తమ ఇతర ప్రాజెక్టులతో హడావుడిగా ఉన్నారు. మరి ఎన్‌జికె డైరెక్టర్ సెల్వ రాఘవన్‌తో సూర్యకి విభేదాల కారణంగానే ప్రమోషన్స్ జరగడం లేదా.... అంటే నిజమనే అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.
మరి ఎప్పుడో బయటికొచ్చిన ఈ న్యూస్‌పై అటు సూర్య, ఇటు సెల్వ ఎక్కడా స్పందించలేదు. మరి వారి మధ్యన విభేదాల కారణంగా నిర్మాతలను బలి చేస్తున్నారా? ఎంతగా మార్కెట్‌లో సినిమా మీద క్రేజ్ ఉన్నా... ప్రేక్షకుల్లోకి సినిమా వెళ్ళాలి అంటే ప్రమోషన్స్ ఎంత అవసరమో మనం చూస్తూనే ఉన్నాం. మరి విడుదల డేట్ దగ్గరపడుతున్నా ఎన్‌జికె టీం చడీ చప్పుడు చెయ్యడం లేదు.. మరి కారణాలు దేవుడికెరుక అన్నట్టుగా వుంది వ్యవహారం.