వయసు షష్టిపూర్తి దాటినా స్టార్ హీరోలకు ఉండే ఇమేజ్, క్రేజ్ దృష్ట్యా సబ్జెక్ట్ డిమాండ్ చేసినా చేయకపోయినా రొమాన్స్, పోరాటాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. చిరంజీవి వంటి మెగాస్టార్ దశాబ్దం తర్వాత రీఎంట్రీ ఇస్తూ చేసిన ‘ఖైదీనెంబర్ 150’లో సైతం కాజల్‌తో రొమాన్స్, సాంగ్స్, స్టెప్స్, భారీ యాక్షన్ సీన్స్ పెట్టారు. కాగా ప్రస్తుతం చిరు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా ‘సై...రా.. నరసింహారెడ్డి’ చిత్రం చేస్తున్నాడు. సబ్జెక్ట్ బాగా సెన్సిటివిటీ ఉండేది కాబట్టి ఇందులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఔన్నత్యాన్ని దెబ్బతీయకుండా ఎంతో జాగ్రత్తగా తీయాలి. అందునా ఇదేమీ కల్పిత కథ కాదు. కాబట్టి దర్శకుడు సురేందర్‌రెడ్డి, నిర్మాత రామ్‌చరణ్‌లతో పాటు చిరు కూడా ఇందులో రొమాన్స్, పాటల విషయంలో సందిగ్ధంలో పడ్డారు. కానీ ఎట్టకేలకు ఇందులో పూర్తి స్థాయిలో చిరు,నయనతార మధ్య రొమాంటిక్ సీన్స్‌లేకుండా సెన్సిబుల్‌గా వాటిని జోడీ చేయనున్నారు.
ఈ విషయంలో సురేందర్‌రెడ్డి, రాఘవేంద్రరావు తీసిన ‘అన్నమయ్య’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాడట. చిరు, నయనల మధ్య అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో వీరిద్దరిపై ఓ డ్యూయెట్‌ని, మరో డ్యూయెట్‌ని తమన్నా, చిరులపై ప్లాన్ చేసుకుంటున్నారు. సో.. ఈ చిత్రంలో రెండు డ్యూయెట్స్ ఉండటం ఖాయమని తేలిపోయింది. ఇది మెగాభిమానులకు సంతోషాన్ని కలిగించే విషయం. ఎందుకంటే ఈ చిత్రంలో ఎలాగూ పోరాట దృశ్యాలకు భారీ స్కోప్ ఉంటుంది. ఇక డ్యూయెట్లు, చిరుమార్క్ స్టెప్స్ ఉంటాయనేది మెగాభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమే. ఇక పాన్ ఇండియాలా ఉండేలా 200కోట్ల భారీ బడ్జెట్‌తో ఈచిత్రాన్ని దక్షిణాదిన అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇక్కడ వచ్చే రెస్పాన్స్‌ని చూసి బాలీవుడ్‌లో విడుదల చేయాలా? వద్దా? అనేది ఆలోచిస్తారట.
ఈ చిత్రాన్ని మొదట స్వాతంత్య్రదినోత్సవ కానుకగా ఆగష్టు15న విడుదల చేయాలని భావించినా, చిత్రం ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి కానుకగా దేశభక్తి మిళితమైన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు అనువైన తేదీగా భావిస్తున్నారు. అక్టోబర్ 8న దసరా కావడంతో అంతకు ముందే వారం రోజులు సెలవులు వస్తాయి. అక్టోబర్ 2 నుంచి వీకెండ్ డేస్‌తో పాటు ఆ తర్వాత దసరా సెలవులను క్యాష్ చేసుకునే ఆలోచనలో ‘సై...రా’ యూనిట్ ఉంది.