వరుసగా హిట్స్ ఇస్తూ, ఏడాదికి రెండు మూడు చిత్రాలు చేస్తూ వస్తున్న నేచురల్‌స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ‘కృష్ణార్జునయుద్దం, దేవదాస్’ వంటి పెద్దగా హిట్ కాని చిత్రాల తర్వాత వచ్చిన ఈ క్రికెట్ నేపధ్యంలో సాగే చిత్రం యునానిమస్‌గా పాజిటివ్ టాక్‌తో, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈమధ్య కాలంలో అంటే ‘మహానటి, రంగస్థలం’ తర్వాత ఇంతగా పాజిటివ్ టాక్ వచ్చిన చిత్రం ఏదీ లేదనేది వాస్తవం. కానీ ఈ చిత్రం పూర్తి ఎమోషనల్ కంటెంట్ ఉన్న క్లాస్ చిత్రం కావడం, యాంటీ క్లైమాక్స్ కారణంగా బి,సి సెంటర్లలో పెద్దగా ఆదరణ లభించలేదు. కానీ ‘ఎ’ సెంటర్లలో మాత్రం ఈ మూవీకి మంచి ఆదరణ లభించింది.
ఇక అదే సమయంలో విడుదలైన రాఘవలారెన్స్ చిత్రం ‘కాంచన3’ కంటెంట్ పెద్దగా లేకపోయినా బి,సి సెంటర్లలో ‘జెర్సీ’కి అడ్డుపడింది. ఈ చిత్రం వల్ల ‘జెర్సీ’కి రావాల్సిన 70శాతం కలెక్షన్లు బి,సి సెంటర్లలో తగ్గాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయినా నాని తన భుజస్కంధాలపై ఈ చిత్రాన్ని నడిపించాడు. నాలుగు వారాల పాటు లాంగ్‌రన్ సాధించిన ఈ చిత్రం ‘మహర్షి’ చిత్రం తర్వాత డీలా పడింది. మధ్యలో ‘అవేంజర్స్’తో కాస్త తలనొప్పులు వచ్చాయి. ఇన్ని అవరోధాల మధ్య కూడా ‘జెర్సీ’ చిత్రం ఏకంగా 34 కోట్ల షేర్‌ని వసూలు చేయడం విశేషం. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ 28 కోట్ల వరకు అమ్ముడైయ్యాయి. ఆ లెక్కన చూస్తే కేవలం థియేటికల్ రైట్స్ ద్వారానే నిర్మాతలకు ఈ చిత్రం ఆరేడు కోట్లు లాభాలు తెచ్చింది. ఇక డిజిటల్, డబ్బింగ్, రీమేక్, శాటిలైట్ వంటి పలు విధాల ఆదాయాలు నిర్మాతలకు లభించనున్నాయి.
మొత్తానికి ఓ క్లాసిక్ మూవీతో వచ్చిన నాని బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాడు. ‘కాంచన3’ పోటీగా రాకుండా ఉండి ఉంటే ఈ చిత్రం ఈజీగా 50కోట్ల క్లబ్‌లో చేరి ఉండేది. ఏదిఏమైనా ఓ అభిరుచి ఉన్న చిత్రం చేసిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ, నేచురల్ స్టార్ నాని, ‘మళ్లీరావా’ తర్వాత రెండో చిత్రంతోనే అద్భుతమైన ఫీల్‌గుడ్ చిత్రాన్ని తీసిన గౌతమ్ తిన్ననూరి వంటి వారు అభినందనీయులు. నష్టాలు వస్తాయేమో అని అంచనాలు వేసిన అందరికీ షాక్ ఇస్తూ ఈ చిత్రం నిర్మాతలకు, బయ్యర్లకు మంచి లాభాలనే తెచ్చిపెట్టిందనేది వాస్తవం.