కోలీవుడ్‌లోని స్టార్ హీరోలలో సూర్య ఒకరు. తాను చేసే విభిన్న చిత్రాల ద్వారా వైవిధ్యభరితమైన నటునిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈయన మురుగదాస్ దర్శకత్వంలో నటించిన ‘గజిని’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లో కూడా స్టార్‌గా మారాడు. నాటి నుంచి నేటి వరకు తాను నటించే ప్రతి కోలీవుడ్ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేస్తూ వస్తున్నాడు. సూర్య అంటే ఇష్టపడే అభిమానులు టాలీవుడ్‌లో కూడా విపరీతంగా ఉన్నారు. కానీ ఈమధ్య ఆయన హవా తెలుగులో తగ్గుతూ వస్తోంది. ‘24, సింగం3, గ్యాంగ్’ ఇలా పలు చిత్రాలు ఆయనను నిరాశపరిచాయి.
తాజాగా ఆయన సెల్వరాఘవన్ దర్శకత్వంలో ‘ఎన్జీకే’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. తెలుగువారికి కూడా సెల్వరాఘవన్ సుపరిచితుడు. ‘7బై జి బృందానకాలనీ’తో పాటు ‘వర్ణ’, వెంకటేష్ హీరోగా వచ్చిన ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ చిత్రాలు ఈయనకు తెలుగులో కూడా మంచి గుర్తింపును తీసుకుని వచ్చాయి. ఇక ‘ఎన్జీకే’ చిత్రం మే31న విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు రిలీజ్ హక్కులను కేవలం 9కోట్లకు రాధామోహన్ దక్కించుకున్నాడు. ఇక ఈ చిత్రం విడుదల సందర్భంగా సూర్య తన అభిమానులతో సోషల్ మీడియాలో చిట్‌చిట్ చేశాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. అయితే దీనిలో ఓ సర్‌ప్రైజ్ చోటు చేసుకుంది. నిన్నమొన్నటివరకు భారత క్రికెట్ వన్డే, టి20 జట్టులో కీలక సభ్యునిగా ఉండి, చెన్నై సూపర్‌కింగ్స్ తరపున ఆడుతున్న సురేష్‌రైనా లైవ్‌లోకి వచ్చిన సూర్యని మీకిష్టమైన చెన్నై సూపర్‌కింగ్స్‌లోని అటగాడు ఎవరు? అనే ఆసక్తికర ప్రశ్నను వేశాడు.
దీంతో ఆశ్యర్యానికి లోనైన సూర్య.. నాకు చెన్నై సూపర్‌కింగ్స్ జట్టులో ధోనీ, మీరు అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. మీకున్న పాటలు పాడే నైపుణ్యం, ధోనిలోని పెయింటింగ్ నైపుణ్యాలను నేను చాలా ఇష్టపడతాను. మీరుండే బిజీలో నాతో మాట్లాడటం నమ్మలేకపోతున్నాను.. అంటూ సూర్య సురేష్‌రైనాకి కృతజ్ఞతలు తెలిపాడు. కాగా ‘ఎన్జీకే’ చిత్రంలో సూర్య నందగోపాలకృష్ణ అనే టైటిల్ రోల్‌ని పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం సూర్యకి మరలా పూర్వ వైభవం తీసుకుని వస్తుందో లేదో వేచిచూడాల్సివుంది...!