రెండు మతాల వారు ప్రేమించుకోవడం, రెండు ప్రాంతాలవారు, రెండు కులాల వారు ప్రేమించుకునే కథలు గతంలో ఎన్నో వచ్చాయి. ‘మరోచరిత్ర’ నుంచి ‘రుద్రవీణ, సీతాకోకచిలుక’ నుంచి మరాఠీలో వచ్చిన ‘సైరత్’(బాలీవుడ్‌లో ‘ధడక్’)వరకు ఇలా వచ్చిన చిత్రాలలో విషాదాంతం అయిన కథలు, సుఖాంతం అయిన స్టోరీలు ఎన్నో ఉన్నాయి. ఇక పరువు హత్యలపై పలు చిత్రాలు వచ్చాయి. ఇక పేద, ధనవంతుల మధ్య కథల సినిమాలు కూడా కోకొల్లలు. అల్లుఅర్జున్ ‘గంగోత్రి’ నుంచి ‘చిత్రం, జయం, నువ్వు నేను’, వెంకటేష్ ‘చంటి’, ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కేలేదు.
ఇక విషయానికి వస్తే టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్‌దేవరకొండ సోదరుడు ఆనంద్ విజయ్‌దేవరకొండ హీరోగా పరిచయం అవుతూ ‘దొరసాని’ అనే చిత్రం రూపొందుతోంది. ఇందులో అనంద్‌కి జోడీగా రాజశేఖర్-జీవితల చిన్నకుమార్తె శివాత్మిక కూడా డెబ్యూ ఇస్తోంది. తన అక్క శివాని తెరంగేట్రం చిత్రం ముందుగా మొదలైనా కూడా ముందుగా తెరంగేట్రం అయ్యే చాన్స్ చెల్లికే ఉందని చెప్పాలి. మంచి అభిరుచి ఉన్ననిర్మాతగా, దర్శకునిగా కూడా పేరు తెచ్చుకున్నా, తన కెరీర్‌లో ఇప్పటివరకు విజయమే సాధించని మధురశ్రీధర్ ఈమూవీని రూపొందిస్తున్నాడు.
టైటిల్ ‘దొరసాని’ టైటిల్‌ని వింటే ఇందులో గొప్పింటి అమ్మాయిని పేద వాడైన యువకుడు ప్రేమిస్తాడని అర్ధమవుతోంది. ప్రీలుక్‌లో కూడా హీరోయిన్ తన చేతులతో హీరో చేతులను తాకుతోంది. హీరోయిన్ చేతికి గాజులు, పెద్ద ఉంగరం ఉండగా, హీరో చేతికి పెయింట్ అంటుకుని ఉంది. ఈ మాత్రం హింట్ చాలు మన ప్రేక్షకులు కథను ఊహించుకోవడానికి. ఇక ‘దొరసాని’ టైటిల్ కూడా హీరోయిన్‌ని ఉద్దేశించే ఉండటం విశేషం.