టాప్‌స్టార్స్‌తో చిత్రాలు చేయడానికి అగ్రనిర్మాతలు క్యూలో ఉంటారు. ఇందులో ఆప్తులు, తమతో గతంలో చిత్రాలు తీసి దెబ్బతిన్నవారు, తమ నుంచి ఎప్పుడో వాగ్దానం పొందిన వారు, మంచి స్టోరీలతో, దర్శకులతో అప్రోచ్ అయ్యేవారు... ఇలా చాలా పెద్ద క్యూనే ఉంటుంది. కానీ వారు నటించేది ఏడాదికి ఒకటి లేదా రెండు చిత్రాలు మాత్రమే. కాబట్టి నిర్మాతలను హర్ట్ చేయకుండా అందరి కమిట్‌మెంట్స్ పూర్తి చేయాలంటే ఎలా? అనేది ఒక ప్రశ్న. దీనికి అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కలిసి రావాలని కోరారు. అలా చేసిన కొన్ని చిత్రాలు దెబ్బతిన్నాయి.
ఇక మహేష్‌బాబు ప్రస్తుతం అదే దారిలో నడుస్తున్నట్లు ఉన్నాడు. ‘మహర్షి’ చిత్రం విషయానికే వస్తే తన వద్దకు వచ్చిన మంచి కథ, నిర్మాణ నైపుణ్యం ఉన్న దిల్‌రాజుని, తనతో ‘బ్రహ్మోత్సవం’ తీసి భారీగా నష్టాల పాలయిన పివిపి సంస్థతో పాటు తనను ఇండస్ట్రీకి పరిచయం చేసి, ‘సైనికుడు’తో దెబ్బతిన్న అశ్వనీదత్.. ఇలా ముగ్గురిని కలిపి చిత్రం చేశాడు. కానీ నిర్మాణ సమయంలోనే తనవంతు లాభం వాటాగా ముందుగా అశ్వనీదత్ తన వంతు ముందుకు ఇచ్చేయని కోరాడని, తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన 10కోట్లు అడిగితే ఏడెనిమిది కోట్లకు సెటిల్‌మెంట్ చేశారని వార్తలు వచ్చాయి. అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ కావడం, ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా జరిగిన నేపధ్యంలో సినిమా ఎంత పెద్ద హిట్ అయినా ఏమీ మిగలదని దిల్‌రాజు చెప్పిన మాటే నిజమైంది.
ఇక తాజాగా మహేష్ హీరోగా తన కాంపౌండ్ దర్శకుడు అనిల్‌రావిపూడితో దిల్‌రాజు చేయాలని భావించిన ‘సరిలేరు నీకెవ్వరు’ కి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. తనతో ‘దూకుడు’ వంటి ఒకే హిట్ తీసి, ఆగడు, 1(నేనొక్కడినే) వంటి డిజాస్టర్స్ నిర్మించిన అనిల్‌సుంకరకి వాటా ఇవ్వాల్సి వచ్చింది. ఇక మహేష్ ‘శ్రీమంతుడు’తో తాను కూడా ఒక భాగస్వామిగా ఉండటం చేశాడు. కానీ ‘బ్రహ్మోత్సవం’ తర్వాత సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు మరలా తన వంతు వాటాగా తన సోదరుడు జి.రమేష్‌బాబు బేనర్‌ని ఇందులో భాగస్వామిని చేశాడు. ఇక మీదట కూడా మహేష్ ఇలానే చేస్తాడా? అనేది వేచిచూడాలి. ఏదిఏమైనా ఇద్దరు ముగ్గురు భాగస్వాములు అంటే అభిప్రాయ భేదాలు, విభేదాలు సహజమే. మరి వీటిని మహేష్ ఎలా అధిగమిస్తాడో వేచిచూడాల్సివుంది...!