ఇటీవల మహర్షి ప్రమోషన్స్‌లో మహేష్‌ని మీరు బాలీవుడ్ వెళ్లే ఉద్దేశ్యం ఉందా? అని ప్రశ్నిస్తే.. ఏదో సాధించాలని బాలీవుడ్ వెళ్లడం కాదు... ఈ విషయంలో రాజమౌళిని చూసి నేర్చుకోవాలి. ఆయన ఇక్కడ ఉండే దేశవ్యాప్తంగా ఎలా సంచలనాలు సృష్టిస్తున్నాడో చూడండి.. అని విలువైన మాట చెప్పాడు. అదే రాజమౌళికి ఇతర దర్శకులకు ఉన్న తేడా అని మనకి స్పష్టంగా అర్దమవుతుంది. ప్రస్తుతం తెలుగులో ప్యాన్ ఇండియా సినిమాలుగా మూడు చిత్రాలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరోసారి రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లతో తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ ఒకటి. ఈ చిత్రం షూటింగ్ ఇంకా 25శాతం కూడా పూర్తి కాలేదు. తనంతట తానుగా మీడియా ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా ఇస్తున్న ఇంపార్టెన్స్‌ని చూసి మిగిలిన దర్శకులు నేర్చుకోవాల్సింది చాలా ఉందనే విషయం స్పష్టమవుతోంది.
ఒక పక్క మెగాస్టార్ చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తమ హోం బేనర్ అయిన ‘కొణిదెల’ ప్రొడక్షన్స్‌లోనే ఈ చిత్రం చేస్తున్నాడు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందన్న మాటలు మినహా ఈచిత్రాన్ని అగ్రెసివ్‌గా ప్రమోట్ చేయడంలో యూనిట్ విఫలమవుతోంది. బాహుబలి విజయంలో దానికి ఇచ్చిన ప్రమోషన్, రోజుల కొద్ది అన్ని పాత్రల లుక్‌లను విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో దేశవ్యాప్తంగా సృష్టించిన ఆసక్తి కీలకం. కానీ ఆ పని చేయడంలో ‘సైరా..’ చిత్రం విఫలమవుతోంది. అక్టోబర్ 2న రిలీజ్ అంటున్నారు గానీ ఈ చిత్రాన్ని అందరూ ఆసక్తిగా ఎదురుచూసేలా చేయడంలో యూనిట్ ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు.
ఇక బాహుబలి తర్వాత ప్రభాస్‌కి వచ్చిన ఇమేజ్, రేంజ్ తెలిసిందే. దాంతో ఆయన తదుపరి చేస్తున్న ‘సాహో’ పై మొదట్లో మీడియా కోడైకూసింది. కానీ ఆ టెంపోని స్టడీగా మెయిన్‌టెయిన్ చేయడంలో చిత్రం యూనిట్ చేతులెత్తేసిన విధంగా కనిపిస్తోంది. మా..మా.. అంటూ రెండు మేకింగ్ వీడియోలు, యానిమేషన్‌ని మరిపించే పోస్టర్స్, మధ్యలో శంకర్-ఎహసాన్-లాయ్‌లు సంగీతం నుంచి తప్పుకున్నారనే విషయంలో అప్‌డేట్ ఇవ్వడంలో అలసత్వం వంటివి కనిపిస్తున్నాయి. ‘సై..రా’కి రెహ్మాన్, ‘సాహో’కి శంకర్-ఎహసాన్-లాయ్‌ల రీప్లేస్‌మెంట్ విషయంలో తప్పటడుగులు వేస్తున్నారు. చిత్ర విడుదలకు కేవలం 70రోజులు కూడా లేకుండా ఆగష్టు15న వస్తున్నాం అని చెప్పడం తప్ప బాహుబలి ప్రమోషన్ టెక్నిక్‌ని వీరు మిస్సవుతున్నారు. ఏదో సాదాసీదాగా తెలుగులో మాత్రమే విడుదల అన్న రేంజ్‌లో ఈ రెండు చిత్రాలు ఉన్నాయి. మరి రాజమౌళి నుంచి మనం నేర్చుకుంది ఏమిటి? అంటే ప్రశ్నార్దకమే అవుతుంది.