ఒకప్పుడు రీమేక్ చిత్రాలంటే కాస్త చిన్నచూపు ఉండేది. కానీ నేడు టాలీవుడ్ చిత్రాలనే బాలీవుడ్, కోలీవుడ్‌లలో రీమేక్ చేస్తున్నారు. కాబట్టి ఇందులో తప్పేమి కనిపించదు. ఇక రీమేక్‌ల కింగ్‌గా తెలుగులో విక్టరీ వెంకటేష్‌కి పేరుంది. అలా ఆయన చేసిన పలు రీమేక్‌లు సంచలన విజయాలను సాధించాయి. ‘చిన్నబ్బాయి, చంటి, సుందరకాండ, సూర్యవంశం, ఘర్షణ’ నుంచి నిన్నమొన్నటి ‘గోపాల గోపాల’, ‘గురు’ దాకా.
కానీ ‘విక్రమ్ వేదా’ రీమేక్‌కి వెంకీ, రానాలు అద్భుతంగా సరిపోతారని భావించినా ఎందుకో వెంకీ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడు మరో బాలీవుడ్ చిత్రం తెలుగులోకి రీమేక్ కానుందని వార్తలు వస్తున్నాయి. సౌత్‌లో పెద్దగా హిట్స్ లేని రకుల్, అజయ్ దేవగణ్‌తో కలిసి నటించిన ‘దే దే ప్యార్‌దే’ అక్కడ అనూహ్యమైన విజయం సాధించి 100కోట్లు దాటి దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో తెలుగు నేటివిటీ బాగా ఉందని, అందునా శ్రీనువైట్ల తరహా కన్‌ఫ్యూజ్‌డ్ ఎంటర్‌టైన్‌మెంట్ మస్త్‌గా ఉండటంతో దీని రీమేక్ రైట్స్‌ని సురేష్‌బాబు సొంతం చేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి.
కథ ప్రకారం 50ఏళ్ల వ్యక్తి ప్రేమలో 25ఏళ్ల అమ్మాయి పడటం, తదుపరి పరిణామాలు ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయి. తెలుగులో 50ఏళ్ల వ్యక్తి పాత్రలో వెంకీ నటిస్తే, ఆయనతో ప్రేమలో పడే 25ఏళ్ల యువతిగా రకుల్‌నే ఎంచుకున్నారని తెలుస్తోంది. మరి ‘వెంకీ మామ’ తర్వాత తాను చేయబోయే చిత్రం ఏమిటో ఇంకా చెప్పని విక్టరీ ఈ రీమేక్‌కి ఓకే చెబితే పెద్ద హిట్ లభించే అవకాశాలున్నాయి.