ఈవారం విడుదలైన ‘హిప్పీ, సెవన్’ చిత్రాలు బాగా నిరాశపరిచాయి. ఇక బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోని హీరోగా యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలో వచ్చిన ‘కిల్లర్’ చిత్రం కంటెంట్ బాగానే ఉన్నా అనేక ప్రతికూలతల మధ్య దానిని సద్వినియోగం చేసుకోలేకపోతోంది. ‘బిచ్చగాడు’తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన విజయ్ ఆంటోని ఆ తర్వాత కొత్తదనం పేరుతో అర్ధం పర్ధం లేని చిత్రాలు తీసి తన మార్కెట్‌ని చెడగొట్టుకోవడం స్వయంకృతాపరాధమేనని చెప్పాలి.
ఇక ‘కిల్లర్’ సినిమా అసలు విడుదలైన సంగతి కూడా జనాలు పట్టించుకోలేదు. పబ్లిసిటీ లేమికి తోడు ‘భారత్, హిప్పీ’ ఫుణ్యమా అని సరైన థియేటర్లు కూడా దొరకలేదు. బి,సి సెంటర్లలో మరో రెండు గంటల్లో సినిమా అనగా అప్పుడు థియేటర్లు కన్‌ఫర్మ్ అయ్యాయి. నిజానికి ‘కిల్లర్’ పేరుతో నాగార్జున, శారద, నగ్మాలు చాలా ఏళ్ల కిందట ఫాజిల్ దర్శకత్వంలో ఓ చిత్రం చేశారు. వరుస పరాజయాల్లో ఉన్న నాగ్‌కి ఆ చిత్రం ఊరట ఇచ్చింది. కానీ ఈ చిత్రం దానికి భిన్నంగా నడుస్తోంది.
‘కిల్లర్’ అనే టైటిల్‌ని చూసిన వారు ఇది ఫ్యామిలీ సినిమా కాదులే అని మౌనంగా ఉంటున్నారు. ఇక బి,సి జనాలు ఇది మనకి అర్ధం కాదులే అని వెళ్లిపోతున్నారు. మొత్తానికి విజయ్ ఆంటోని చిత్రం అంటే టీవీలో వస్తుంది కదా...! అప్పుడు చూద్దాంలే అనే పరిస్థితి వచ్చింది. మరి విజయ్ ఆంటోని ఈ విషయాన్ని ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిదని చెప్పాలి.