టాలీవుడ్ సీనియర్ నటి.. కమ్ పొలిటీషియన్ విజయశాంతి పుట్టిన రోజు నేడు. రాములక్క నేటితో 52 ఏళ్లు పూర్తి చేసుకుని 53వ పడిలోకి అడుగుపెడుతున్నారు. రాములమ్మ బర్త్ డే నాడు పలువురు అభిమానులు, రాజకీయ, సీనీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ట్విట్టర్ వేదికగా రాములమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. విజయశాంతి నటించి మెప్పించిన ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమాలో మహేశ్ బాలనటుడిగా కనిపించిన విషయాన్ని ప్రిన్స్ గుర్తుకు తెచ్చుకున్నారు.
‘‘విజయశాంతి మేడం గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీతో కలిసి మరోసారి పనిచేయడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ ఏడాది మీకు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని మహేశ్ ట్విట్టర్‌లో చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్‌కు రాములమ్మ కూడా రియాక్ట్ అయ్యారు. థ్యాంక్యూ మహేశ్.. తాను కూడా మీతో కలిసి పనిచేయాలని వేచి చూస్తున్నానని తెలిపారు.
కాగా.. మహేశ్ తదుపరి సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మహేశ్ విషెస్‌ను ట్విట్టర్‌లో చూసిన ఘట్టమనేని, రాములక్క అభిమానులు.. పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొందరు అభిమానులు ‘కొడుకు దిద్దిన కాపురం’ లోని ఫొటోలు పోస్ట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.