తెలుగు రాష్ట్రాల్లో అక్రమ, అవినీతి.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన.. నిర్మిస్తున్న భవనాలను వైఎస్ జగన్, కేసీఆర్ సర్కార్‌లు కూల్చేసే పనిలో బిజిబిజీగా ఉంటున్నారు. ఇప్పటికే ఏపీలో ప్రజావేదికను కూల్చివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న నిర్మాణాలను కూల్చివేస్తోంది. తాజాగా.. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వీవీ వినాయక్‌కు చెందిన ఓ భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు.
పూర్తి వివరాల్లోకెళితే.. భాగ్యనగరంలోని శివారు ప్రాంతమైన వట్టినాగులపల్లిలో వినాయక్ కొంతకాలంగా నాలుగు అంతస్తుల భవంతి నిర్మించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు బుధవారం రాత్రి అక్కడికి చేరుకుని పర్మిషన్ పత్రాలు అన్నీ పరిశీలించగా.. సరైన అనుమతులు లేవని గుర్తించారు. దీంతో వెంటనే దర్శకుడు వినాయక్‌కు అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. 111 జీవోకు వ్యతిరేకంగా నిర్మాణం ఉందంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ నోటీసులకు వినాయక్ స్పందించకపోవడంతో అధికారులు ఇక తమ పని కానిచ్చేశారు. బుధవారం రాత్రి రంగంలోకి దిగిన అధికారులు వట్టినాగులపల్లిలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేయడం జరిగింది. అయితే ఇది నిజంగా అనుమతి తీసుకోని నిర్మాణామా..? లేదా అన్ని అనుమతులు సక్రమంగా ఉన్నాయా..? అనే విషయంపై వినాయక్ మాత్రం ఇంత వరకూ మీడియా ముందుకు గానీ.. సోషల్ మీడియాలో గానీ రియాక్ట్ అవ్వలేదు.