మెగా ఫ్యామిలీకి రాయలసీమ బ్యాగ్రౌండ్ సినిమాలు అంతగా అచ్చి రాలేదా..? పదే పదే ఇలా ఎందుకు అడ్డంకులు వస్తున్నాయ్..? రాయలసీమ వాసులు ఎందుకిలా వరుస షాక్‌లు ఇస్తున్నారు..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. మరీ ముఖ్యంగా మొన్న మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్... నేడు వరుణ్ తేజ్ ఇలా మెగా హీరోలు రాయలసీమ వాసుల ఆగ్రహానికి లోనవుతున్నారు.
ఇటీవల.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న ‘సైరా’ చిత్రం విషయంలో తమను సంప్రదించకుండా ఇష్టానుసారం కథ తెరకెక్కించేశారని కర్నూలుకు చెందిన ఉయ్యాలవాడ వారి వారసులు చెర్రీ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. దీంతో చెర్రీ ప్రాంతీయ, జాతీయ స్థాయిలో వార్తల్లోకెక్కారు. ఈ వ్యవహారంలో పలువురు మెగా ఫ్యామిలీపైనే కన్నెర్రజేశారు. అయితే తాజాగా.. మరో మెగా హీరో వరుణ్‌తేజ్ ముందుకొచ్చి పలువురు బోయలు ఆందోళన చేపట్టారు.
వాస్తవానికి రామాయణాన్ని రాసిన ‘వాల్మీకి’ బోయవాడన్న విషయం విదితమే. రాముడి చరితను ప్రపంచానికి చెప్పిన బోయవాడు. అయితే ‘వాల్మీకి’ పేరుతో వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో జరుగుతోంది. ఏకంగా షూటింగ్ స్పాట్‌కు వెళ్లిన బోయవారు అడ్డుకున్నారు. ఎంత సర్దిచెప్పినప్పటికీ వివాదానికి ఫుల్‌స్టాప్ పడకపోవడంతో చేసేదేమీ లేక షూటింగ్ ఆపేశారు. సో.. దీన్ని బట్టి చూస్తే మెగా ఫ్యామిలీకి రాయలసీమ బ్యాగ్రౌండ్ సినిమాలు పెద్దగా అచ్చిరాలేదని క్రిటిక్స్, నెటిజన్లు చెబుతున్నారు.