విజయదేవరకొండ, షాలిని నటీనటులుగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’.. టాలీవుడ్‌లో పలు రికార్డులు బ్రేక్ చేసి సత్తా చాటిన విషయం విదితమే. ఆ తర్వాత ఇదే సినిమాను పలు భాషల్లోకి రీమేక్ చేసుకోవడం.. ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతూ పలు సినిమాలు చేయడం మొదలైంది. ఒక్క మాటలో చెప్పాలంటే అర్జున్ రెడ్డి ట్రెండ్ గట్టిగానే సెట్ చేశారని చెప్పుకోవచ్చు. అంతేకాదు.. కలెక్షన్లు సైతం ఊహించని రీతిలో కలెక్ట్ చేసింది. దీంతో విజయదేవరకొండ పేరు ఎక్కడికో పాకిపోయింది.
అయితే.. ‘అర్జున్ రెడ్డి’కి మించిన కథతో త్వరలో మీ ముందుకు వస్తున్నానని వివాదాస్పద చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత, వైసీపీ నేత రాకేష్ రెడ్డి చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కథను ఇప్పటికే ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ రాశారని అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందన్నారు. ఈ సినిమాలో ఎవరు ఏ పాత్రలో నటిస్తున్నారు..? హీరో ఎవరు..? హీరోయిన్ ఎవరు..? అనే విషయాలను నిశితంగా మీడియాకు వివరిస్తామన్నారు. అంతేకాదు.. ఈ చిత్రం అర్జున్‌రెడ్డిని మించిపోతుందని రాకేష్ రెడ్డి చెబుతున్నారు.
కాగా.. అర్జున్ రెడ్డిలో అటు మంచి లవ్ ట్రావ్ ట్రాక్‌తో పాటు హాట్ హాట్ సీన్లు గట్టిగానే పెట్టారు. అయితే ఇవే సినిమాకు ప్లస్ అయ్యాయి. యూత్ పెద్ద ఎత్తున ఈ సినిమా చూడటానికి థియేటర్లకు క్యూకట్టి సూపర్ డూపర్ హిట్ చేశారు. ఇక రాకేష్ రెడ్డి సినిమా కథ విషయానికొస్తే.. అర్జున్ రెడ్డికి మించిన కథ అంటే హాట్ సీన్లు పండిస్తారా..? లేకుంటే మరి దేన్ని ఉద్దేశించి ఈ మాటలు అన్నారు అనేది తెలియాలంటే తెరకెక్కే వరకు వేచి చూడాల్సిందే మరి.