తెలుగు సినీ ప్రియులకు దివంగత నటుడు ఉదయ్ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన నటించిన చిత్రాలు.. ఆయన వచ్చిన బ్యాగ్రౌండ్ అలాంటిది మరి.. అందుకే ఆయన హీరోగా వచ్చిన కొన్ని చిత్రాలను మరిచిపోదామనకున్నా మరువలేం. ‘నువ్వు నేను’ వేర్వేరు కాదు ఒక్కటే అని చెప్పాలన్నా..‘మనసంతా నువ్వే’ లవర్స్ మనసు దోచుకోవాలన్నా.. ఒక్క ఉదయ్ కిరణ్‌కు తప్ప మరెవ్వరికీ సాధ్యం కాదు.. కాబోదు కూడా.. అదీ లవ్ బాయ్ రేంజ్.
ఏం జరిగిందో ఏమోగానీ ఉదయ్ హఠాన్మరణం చెందడం చాలా మంది సినీ ప్రియులను.. టాలీవుడ్ విషాదంలోకి నెట్టేసింది. అయితే ఉదయ్ కిరణ్ బయోపిక్‌ను తెరకెక్కించాలనే యోచనలో తేజ ఉన్నాడని పుకార్లు వచ్చిన విషయం విదితమే. వాస్తవానికి ఆయన్ను ‘చిత్రం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా తేజనే. ఒక్క మాటలో చెప్పాలంటే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ భాక్సాఫీస్‌ను షేక్ చేసినవే. మరోవైపు ఉదయ్ నటించిన ప్రేమ చిత్రాలు ఇప్పటికీ కొన్ని కోట్ల మంది కుర్రకారు హృదయాల్లో నిలిచిపోయాయి.
ఓ ఇంటర్వ్యూ వేదికగా ఉదయ్ కిరణ్ బయోపిక్‌పై మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ఉదయ్ గురించి నాకు తెలియని విషయాలంటూ ఏమీ లేవు.. అన్నీ రహస్యాలూ తెలుసు. కానీ ఈ టైమ్‌లో బయోపిక్ చేసి ఏం లాభం లేదు. ఆయన జీవితంపై సినిమా చేసి నేను డబ్బులు సంపాదించుకోవాలా..? ఈ ఆలోచన వచ్చే నేను ఈ బయోపిక్ చేయడం లేదు. ఉదయ్ కిరణ్ జీవితంపై సినిమా చేస్తే ఇప్పుడు వచ్చే కుర్ర హీరోలకు అదో గుణపాఠంగా మిగిలిపోతుంది. కానీ ప్రేక్షకులకు వినోదం మాత్రమే ఇవ్వాలి.. పాఠం చెప్పకూడదనే ఉద్దేశ్యంతోనే బయోపిక్ చేయడం లేదు’ అని తేజ చెప్పుకొచ్చారు. అయితే ఆ రహస్యాలేంటో..? ఆ గుణపాఠాలేంటో..? పైనున్న పెరుమాళ్లకు.. కిందున్న తేజకే ఎరుక.