అవును మీరు వింటున్నది నిజమే.. మాజీ సీఎం కుమారుడితో సినిమా తీయడానికి బోయపాటి శ్రీను ప్లాన్ చేస్తున్నాడని ఫిల్మ్‌నగర్‌లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే సినిమా సెట్స్ దాకా తీసుకెళ్లాలని బోయపాటి భావిస్తున్నారట. ఇంతకీ ఆ మాజీ సీఎం ఎవరంటారా..? ఆయనేనండి.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో మాండ్యా నుంచి జేడీఎస్ తరఫున నిఖిల్‌కు అదృష్టం కలిసిరాలేదు. ఇక్కడ్నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసిన సుమలత ఊహించని మెజార్టీ అఖండ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో నిఖిల్ ఘోర పరాజయం పాలవ్వడం.. మరోవైపు కన్నడనాట కుమారన్న సర్కార్ కుప్పకూలిపోవడం వరుస పరిణామాల నేపథ్యంలో రాజకీయాలకు రాం రాం చెప్పేసి మళ్లీ సినిమాల్లోకి రావాలని నిఖిల్ నిర్ణయించినట్లు తెలుస్తో్ంది.
కాగా ఇప్పటికే ‘జాగ్వార్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నిఖిల్.. ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. అయితే నిఖిల్-బోయపాటికి ఎక్కడ కనెక్షన్ సెట్ అయ్యిందో తెలియట్లేదు కానీ.. సినిమా చేయడానికి మాత్రం బోయపాటి సిద్ధంగా ఉన్నారట. కథ కూడా ఆ హీరోకు సరిగ్గా సెట్ అవుతుందని భావిస్తున్నారట. మరోవైపు భారీ సినిమాలంటున్న బోయపాటి ‘వినయ విధేయ రామ’ ఈ మధ్య అట్టర్‌ప్లాప్‌ను ఖాతాలో వేసుకున్నారు. అయితే నిఖిల్‌తో సినిమా పట్టాలెక్కించి సక్సెస్ సాధిస్తారా..? లేదా..? అసలు సినిమా ఉందో..? లేదో..? తెలియాలంటే బోయపాటి రియాక్ట్ అవ్వాల్సిందే మరి.