డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఈయనకు ఇప్పుడు కాస్త కాలం కలిసి రాలేదు కానీ.. సూపర్ స్టార్ మహేశ్ ‘పోకిరి’ తర్వాత ఎన్టీఆర్ ‘టెంపర్’ టైమ్‌లో పూరీ క్రేజే వేరు.. ఇది ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా నిజం. ఆ తర్వాత వరుస ప్లాప్‌లు రావడం తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’తో ఆ లోటును కాస్త భర్తీ చేసుకున్నాడు. అయితే ఒకప్పుడు పూరీ అంటే పడి చచ్చే అభిమానులు.. విగ్రహాలు పెట్టేసేంత వీరాభిమానులుండే వారు.. ఇప్పటికీ ఉన్నారు కూడా.
నటీనటులు, డైరెక్టర్లకు తెలుగు రాష్ట్రాల్లో ఉండే వీరాభిమానులు ఏం చేయడానికి సిద్ధపడుతుంటారు. సినిమాలు హిట్ అంటే హిట్ లేకుంటే అంతే సంగతులు. వాళ్లు ఏమనకుంటే అది చేస్తారంతే. మరోవైపు తమ అభిమాన నటుడు పేరును పచ్చబొట్టు వేయించుకోవడం చూస్తుంటాం. అయితే పూరీ వీరాభిమాని మాత్రం ఏకంగా గుండెపైనే.. డాషింగ్ డైరెక్టర్‌నే టాటూ వేయించుకున్నాడు.
‘ఇస్మార్ శంకర్’ సూపర్ డూపర్ హిట్ కావడంతో విజయోత్సవ వేడుకలు జరుపుకుంటోంది చిత్రబృందం. ఇందులో భాగంగా ఇటీవల హన్మకొండుకు వెళ్లిన పూరీ అండ్ టీమ్‌కు ఓ వీరాభిమాని ప్రభాకర్ సడన్ సర్‌ఫ్రైజ్ ఇచ్చాడు. కారులో ఉన్న పూరీ దగ్గరికొచ్చి సార్ అంటూ నమస్కరించి.. తన ఛాతిపై వేసుకున్న పూరీ పచ్చబొట్టును చూపించాడు. వామ్మో.. అనుకున్న పూరీ ఆ ఫొటోవైపే తథేకంగా చూసి ఫిదా అయిపోయారు. అనంతరం పూరీ కాళ్లకు నమస్కరించిన వీరాభిమాని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా చార్మీ చెప్పుకొచ్చింది.