ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సీజన్ మొదలుకుని ఫలితాలు వచ్చే వరకూ థర్టీ ఇయర్స్ పృథ్వీ ఏ రేంజ్‌లో మాట్లాడుతున్నారో అందరికీ తెలిసిందే. ఇటీవల మరింత డోస్ పెంచి వైసీసీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం టాలీవుడ్‌కు ఇష్టం లేదు.. అందుకే ఇండస్ట్రీ పెద్దలు ఎవరూ కలవట్లేదని వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఈ వ్యాఖ్యలకు పోసాని ఆ తర్వాత నటికిరీటి రాజేంద్ర ప్రసాద్ రియాక్ట్ అయ్యారు. దీంతో మరింత రెచ్చిపోయిన పృథ్వీ ఈసారి ఏకంగా ఘాటుగా హెచ్చరించి తాటతీస్తానని పెద్దపెద్ద మాటలే మాట్లాడారు.
గురువారం నాడు పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న ఆయన.. కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. అంతటితో ఆగని ఆయన.. జగన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపితే బాగుండని మాత్రమే తాను చెప్పానంతే కానీ ఎవర్నీ తప్పుగా అనలేదన్నారు.
రాజేంద్రప్రసాద్ చేసిన వాఖ్యలు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని.. చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టగానే సన్మానాలు చేశారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇకనుంచి జగన్‌ను ఎవరైనా ఏమైనా అంటే ఒక్కొక్కరి తాట తీస్తా అని పృథ్వీ ఘాటుగా హెచ్చరించారు. కాగా.. వైఎస్ జగన్‌ను కలవడానికి తామేం బిజినెస్‌మెన్‌లం కాదని రాజేంద్రప్రసాద్ తిరుమల వేదికగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇందుకు స్పందించిన పృథ్వీ పై విధంగా స్పందించారు.