వీక్ మిడిల్‌లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టాలీవుడ్‌లో రెండు మీడియం బడ్జెట్ సినిమాలు విడుదలయ్యాయి. ఒక సినిమాకి యంగ్ హీరోలలో మంచి మార్కెట్ ఉన్న శర్వానంద్ హీరో. మరో సినిమాలో క్రైమ్ థ్రిల్లర్ కథలతో హీరోగా ఆకట్టుకుంటున్న హీరో అడవి శేష్. శర్వానంద్ సినిమాలంటే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంటుంది. ఇక అడవి శేష్ సినిమాలకు కూడా ఓ స్పెషల్ కేటగిరి ఆడియన్స్ ఉన్నారు. ఇక శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రణరంగం, అడవి శేష్ - రెజినా జంటగా నటించిన ఎవరు సినిమాలు ఈ గురువారం విడుదలయ్యాయి. శర్వానంద్ రణరంగం సినిమాకి ప్రేక్షకులు, క్రిటిక్స్ యావరేజ్ టాక్ ఇవ్వగా... ఎవరు సినిమాకి ప్రేక్షకులే కాదు.. క్రిటిక్స్ కూడా హిట్ టాక్ ఇచ్చారు.
అతి తక్కువ కాలంలో డాన్ గా పెరిగిన పాత్రలో దేవా గా శర్వా లుక్స్, నటన అన్ని రణరంగంలో బాగున్నప్పటికీ.... దర్శకత్వం, స్క్రీన్ ప్లే చెత్తగా ఉండడంతో రణరంగం సినిమాకి యావరేజ్ టాక్ పడింది. ఇక అడవి శేష్ నటన, రెజినా గ్లామర్ అండ్ నటన, కథ, స్క్రీన్ ప్లే, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అన్ని ఎవరు సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ ఇచ్చాయి. అయితే యావరేజ్ టాక్ తోనే శర్వానంద్ రణరంగం మొదటిరోజు అదిరిపోయే ఓపెనింగ్స్ అంటే శర్వా కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. ఇక అడవి శేష్ ఎవరు కూడా శేష్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది.
అయితే ఎంతగా ఓపెనింగ్స్ సాధించినా రణరంగం సినిమా స్టామినా ఏంటనేది ఈ వీకెండ్ గడిస్తేనే కానీ చెప్పలేం. ఎందుకంటే రణరంగం యావరేజ్ టాక్ తోనూ బిసి సెంటర్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఇక అడవి శేష్ ఎవరు మాత్రం మల్టిప్లెక్స్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చెయ్యడమే కాదు శుక్ర, శని, ఆది వారాల్లో ఎవరు థియేటర్స్ బుకింగ్స్ కళకళలాడుతున్నాయి. మరి ఈ గురువారం బాక్సాఫీసు రణరంగంలో గెలిచింది ఎవరు అంటే ‘ఎవరు’ నే..!