అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ నటీనటులుగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన అట్టర్ ప్లాప్ చిత్రం ‘మన్మథుడు-2’. ఈ చిత్రం ఆశించినంతగా ఆడకపోవడంతో తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోని నాగ్ చేస్తున్నాడట. ప్రస్తుతం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ సినిమా చేస్తున్నట్లు నాగ్ కూడా ధృవీకరించిన విషయం విదితమే. అయితే బంగార్రాజు తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నాగ్ సినిమా ఉంటుందని వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ వార్త సదరు డైరెక్టర్ చెవిన పడటంతో ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చాడు.
‘నేను నాగార్జునను కలవలేదు. అంతేకాదు ఆయనకి ఎలాంటి కథను వినిపించలేదు. ఏ కథకి సంబంధించిన చర్చలు మా మధ్య జరగలేదు. నాగార్జునతో నేను సినిమా చేయనున్నట్టుగా వస్తోన్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. త్వరలో ఓ సీనియర్ హీరోతో నా సినిమా ఉంటుంది. ఆ విషయాలను త్వరలోనే వెల్లడిస్తాను’ అని గోపీ స్పష్టం చేశాడు. అయితే ఆ సీనియర్ హీరో ఎవరో.. ? నిజంగానే సినిమా ఉందా లేదా..? అనే విషయాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.