11 భాషల్లో 500కు పైగా చిత్రాలు చేసిన సీనియర్ నటుడు సత్యప్రకాష్ దర్శకత్వంలో ‘ఉల్లాలా ఉల్లాలా’
సీనియర్ నటుడు సత్యప్రకాష్ పేరు చెప్పగానే ‘పోలీస్ స్టోరీ’ సినిమా గుర్తుకొస్తుంది. ఈ ఒక్క సినిమా అనే కాదు, ఎన్నో ఎన్నెన్నో సూపర్ హిట్ సినిమాల్లో ప్రతినాయకుడిగానూ, ముఖ్య పాత్రధారిగానూ రాణించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. 11 భాషల్లో 500కు పైగా చిత్రాల్లో నటించిన ఈ సీనియర్ నటుడు తొలిసారిగా మెగాఫోన్ చేతబట్టారు. సత్యప్రకాష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం పేరు ‘ఉల్లాలా ఉల్లాలా’. గత వేలంటైన్స్ డేకి భారీ ఎత్తున ‘లవర్స్ డే’ చిత్రాన్ని విడుదల చేసి మంచి నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుఖీభవ మూవీస్ అధినేత ఎ.గురురాజ్ ‘ఉల్లాలా ఉల్లాలా’ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. నటరాజ్, నూరిన్, అంకిత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది.
ఈ సందర్భంగా దర్శకుడు సత్యప్రకాష్ మాట్లాడుతూ.. ‘‘తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఒరియా, బెంగాలీ, భోజ్‌పురి, మరాఠీ, పంజాబీ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో 500కు పైగా సినిమాల్లో నటించాను. ‘పోలీస్ స్టోరీ’, ‘సీతారామరాజు’, ‘పెళ్లి చేసుకుందాం’, ‘సమర సింహారెడ్డి’, ‘మాస్టర్’, ‘డేంజర్’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘బిగ్ బాస్’ తదితర చిత్రాలు నాకెంతగానో పేరు తెచ్చిపెట్టాయి. ఇన్నేళ్ల కెరీర్‌లో నటుడిగా పూర్తిస్థాయి సంతృప్తితో ఉన్నాను. దర్శకత్వం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. ఇదొక రొమాంటిక్ ఎంటర్‌టైనింగ్ థ్రిల్లర్. ఈ సినిమాలో చాలా వింతలూ విశేషాలూ ఉన్నాయి. ఎవ్వరూ ఊహించని రీతిలో ఈ సినిమా ఉంటుంది. మేకింగ్ పరంగా కూడా చాలా కొత్తగా ఉంటుంది. దర్శకునిగా నా తొలి చిత్రానికి గురురాజ్‌లాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం’’ అని చెప్పారు.
నిర్మాత ఎ.గురురాజ్ మాట్లాడుతూ.. ‘‘సత్యప్రకాష్ నాకెప్పటి నుంచో మంచి స్నేహితుడు. నటునిగా అతనిలో ఎంత ఫైర్ ఉందో, దర్శకునిగా అంతకు మించిన ఫైర్ ఉంది. ఈ చిత్రానికి నేనే కథను అందించాను. మేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ‘ఉల్లాలా ఉల్లాలా’ చిత్రం నిర్మాతగా నాకు, దర్శకునిగా సత్యప్రకాష్‌కూ కచ్చితంగా ఓ టర్నింగ్ పాయింట్ అవుతుంది. షూటింగ్ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది. అతి త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు.
తారాగణం
నటరాజ్, నూరిన్, అంకిత, గురురాజ్, సత్యప్రకాష్, ‘బాహుబలి’ ప్రభాకర్, పృథ్వీరాజ్, ‘అదుర్స్’ రఘు, జబర్ధస్త్ నవీన్, లోబో, మధు, జబర్ధస్త్ అప్పారావు, రాజమౌళి, జ్యోతి, గీతాసింగ్, జయవాణి తదితరులు
సాంకేతిక నిపుణులు
సమర్పణ: శ్రీమతి ఎ.ముత్తమ్మ,
ఛాయాగ్రహణం: జె.జి.కృష్ణ, దీపక్,
సంగీతం: జాయ్,
ఎడిటింగ్: ఉద్ధవ్,
నృత్య దర్శకత్వం: శేఖర్ మాస్టర్, దిలీప్ కుమార్,
యాక్షన్: డ్రాగన్ ప్రకాష్,
ఆర్ట్: కె.మురళీధర్,
పాటలు: కాసర్ల శ్యామ్, గురుచరణ్,
కథ - నిర్మాత: ఎ.గురురాజ్,
స్క్రీన్‌ప్లే - మాటలు - దర్శకత్వం: సత్యప్రకాష్.