మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు డా. రాజశేఖర్ రూ. 10 లక్షల విరాళం
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు గడించింది. ఎన్నికల సందర్భంగా ‘మా’ సభ్యులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నూతన కార్యవర్గం ప్రయత్నాలు చేస్తోంది. అయితే హామీల అమలు కోసం మూలధనంను తీసి ఖర్చుచేయడం సమంజసం కాదని భావించిన డాక్టర్ రాజశేఖర్... తన వంతుగా రూ. 10 లక్షల రూపాయలను విరాళంగా అందించారు.
ఇంతవరకూ ‘మా’ అసోసియేషన్ అదనపు నిధులను సేకరించే సంక్షేమ కార్యక్రమాలు జరుపుతోందని, ఈసారి కూడా అదే తరహాలో నిధులను సేకరించాలని నిర్ణయించుకున్నామని ‘మా’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డా.రాజశేఖర్ చెప్పారు. చిత్రసీమలోని అందరి సహకారంతో త్వరలోనే కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసి, నిధులను సమీకరిస్తామని తెలిపారు. డా. రాజశేఖర్ ‘మా’కు పది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం పట్ల కార్యవర్గ సభ్యులు పలువురు హర్షం వ్యక్తం చేశారు.