‘బాహుబలి’, ‘సాహో’ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు చేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కోసం డైరెక్టర్లు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం లవ్ ట్రాక్‌లో ఉండే సినిమా చేయాలని ఆయన భావిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ కోసం కొందరు డైరెక్టర్లు ఇప్పటికే కథలు సిద్ధం చేయగా.. మరికొందరు అదే పనిలో ఉన్నారు.
ఈ క్రమంలో ‘సాహో’ కోసం ప్రాణం పణంగా పెట్టి మరీ తెరకెక్కించి.. హాలీవుడ్ రేంజ్‌లో తీసి ప్రపంచ వ్యాప్తంగా తన సత్తా ఏంటో చాటిన సుజిత్‌తో మళ్లీ ప్రభాస్ సినిమా చేస్తారని టాక్ నడుస్తోంది. వాస్తవానికి వసూళ్లు బాగున్నా.. సినిమా మాత్రం ఆశించనంతగా ఆడలేకపోయింది. అయితే సినిమా రిలీజ్ రోజే ప్రభాస్ నుంచి సుజిత్‌కు ఫోన్ వచ్చింది. ‘సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందనే కంగారు పడకు.. ఎలా ఉన్నా సరే మళ్లీ ఇంకో మూవీ కచ్చితంగా చేద్దాం.. ఏం బాధపడకు’ అనేది ఆ ఫోన్ కాల్ సారాంశం.
అంతేకాదు.. ఇటీవలే మీడియా ముందుకొచ్చిన సుజిత్.. డార్లింగ్‌తో సినిమా చేస్తానని ధీమాగా చెప్పాడు. ఈసారి మాత్రం పక్కాగా మాస్ కమర్షియల్ చిత్రమట. అయితే దీన్ని బట్టి చూస్తే డార్లింగ్ నిజంగానే సుజిత్ మాటిచ్చేశారని స్పష్టంగా అర్థమవుతోంది. మళ్లీ స్టార్ హీరోతోనే సుజిత్ సినిమా చేస్తాడన్న మాట. మరి ఈ కాంబోలో వచ్చే చిత్రం అభిమానులను, సినీ ప్రియులను ఏ మాత్రం మెప్పిస్తుందో వేచి చూడాలి మరి.