ఏఆర్ మురుగదాస్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఇటు టాలీవుడ్‌ను అటు కోలీవుడ్‌ను తన సినిమాలతో ఓ ఊపేసి స్టార్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్య ఈయనకు కాసింత కాలం కలిసిరాలేదు కానీ.. ఈయన సినిమాలంటే పడిచచ్చే జనాలున్నారంటే అర్థం చేసుకోండి. ముఖ్యంగా తెలుగులో సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో సినిమా తీయాలి.. తీయాలి అని ఎన్నో రోజులుగా వేచి చూసి చివరికి ‘స్పైడర్’ను తెరకెక్కించగా అనుకున్నదొక్కటి.. అయినొదక్కటి అన్న చందంగా ఊహించని ఫలితం వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో టాలీవుడ్ వైపు మురగ అస్సలు రాలేదు.
అయితే ఈసారి మాత్రం మాంచి కథతో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలుగు కమ్ తమిళ్ సినిమా చేయాలని ఫిక్స్ అయిన మురుగదాస్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌తో చర్చలు జరపుతున్నట్లు తెలుస్తోంది. గత రెండ్రోజులుగా ఇందుకు సంబంధించిన వార్తలు ఇటు సోషల్ మీడియాలో.. అటు ఫిల్మ్‌నగర్‌లో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
వీరిద్దర్నే సంప్రదించడానికి కారణం కూడా ఉందట. వాస్తవానికి బన్నీ ద్విభాషా చిత్రంలో నటించాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మురుగ బన్నీ కాంపౌండ్‌లో వచ్చి వాలాడట. మరోవైపు.. జూనియర్‌తో కూడా ఈయన టచ్‌లో ఉన్నారట. ప్రస్తుతానికి బన్నీ.. ‘అల వైకుంఠపురంలో..’ ఆ తర్వాత సుకుమార్‌తో.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం భారీ బడ్జెట్ సినిమా RRRతో బిజీబిజీగా ఉన్నారు. అయితే ఈ ఇద్దరిలో ఎవర్ని మురుగ ఫైనల్ చేసుకుంటాడో..? ఎవరు మురుగకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే మరి.