చిరు - సురేందర్ రెడ్డిల సై రా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఎంతో గ్రాండ్ గా నిర్వహించడానికి ఈవెంట్ ప్లానర్లు ప్లాన్ చేశారు. అలాగే వారం రోజులనుండి కష్టపడ్డారు. ఎప్పటినుండో సై రా ఈవెంట్ కోసం మెగా ఫ్యాన్స్ ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్కచెయ్యకుండా ఈ ఈవెంట్ కి మెగా ఫ్యాన్స్ హైదరాబాద్ కి క్యూ కట్టారు. ఇక ఈ ఈవెంట్ కి చిరు, పవన్ కళ్యాణ్, రాజమౌళి, రామ్ చరణ్, చిరు భార్య సురేఖ, కూతుళ్లు సుష్మిత, శ్రీజ, కోడలు ఉపాసన, వరుణ్ తేజ్, సాయి ధర్మ తేజ్, వైష్ణవ తేజ్, కొరటాల, వినాయక్, సురేష్ బాబు లాంటి అతిధులు పాల్గొన్నారు. ఇక చిరుని, పవన్ కళ్యాణ్ ని, రామ్ చరణ్ ని చూసిన అభిమానులకు పూనకాలొచ్చేశాయి.
కానీ మెగా ఫ్యాన్స్ ఉత్సాహం మీద వరుణుడు నీళ్లు చల్లేసాడు. సై రా ఈవెంట్ మొదలైనప్పటి నుండి చినుకులు పడుతూనే ఉన్నాయి. మెగాస్టార్ సాంగ్స్ తోనూ, డాన్స్ తోనూ హోరెత్తిన సై రా స్టేజి చిరు, పవన్, రాజమౌళి, రామ్ చరణ్ లతో కళకళలాడింది. అయితే తమ అభిమాన హీరోలు మాట్లాడుతుంటే.. మైమరచిపోయి వినే ఫ్యాన్స్ మీద వర్షం విరుచుకుపడింది. ఇక చరణ్ , చిరు, పవన్ కళ్యాణ్ లు కూడా గబగబా స్టేజ్ ఎక్కి ఏవో మాట్లాడాల్సిన నాలుగు మాటలు సై రా గురించి మాట్లాడేసి ఫోటోలకు ఫోజులిచ్చేసి స్టేజ్ దిగిపోయారు. మరి ఎప్పటినుండో సై రా ఈవెంట్ కోసం కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూసిన మెగా ఫ్యాన్స్ ఈ వర్షాన్ని చూసి ఉసూరుమానాల్సిన పరిస్థితి.