టాలీవుడ్‌లో ఒకప్పటి భారీ బడ్జెట్ చిత్రాలు వేరు.. ఇప్పటి చిత్రాలు వేరు. ‘బాహుబలి’ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు వచ్చిన తర్వాతే దర్శకనిర్మాతలకు ధైర్యం పెరిగింది. ఎందుకంటే వాస్తవానికి భారీ బడ్జెట్ సినిమాలు చేయాలంటే ఒకప్పుడు దర్శకులు, నిర్మాతలు జంకేవారు. కనివినీ ఎరుగని రీతిలో ‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలను తెరకెక్కించడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘బాహుబలికి ముందు.. ఆ తర్వాత’ అనుకునేట్లుగా దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న ట్రెండ్‌ను అలా సెట్ చేశారు.
ఇక అసలు విషయానికొస్తే.. టాలీవుడ్ కుర్రహీరోలు అయిన మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లతో తెరకెక్కిస్తున్న చిత్రానికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అదేంటంటే.. ఇప్పటికే రిలీజైన ‘సాహో’ సినిమా గట్టిగానే కాసులు కురిపించినప్పటికీ సినిమా పెద్దగా ఆడలేదు ఇందుకు ప్రధాన కారణం నిడివి ఎక్కువగా ఉండటమే. అంతేకాదు.. త్వరలో మెగాభిమానుల ముందుకు రాబోతున్న చిరు చిత్రం ‘సైరా’లో కూడా నిడివి ఎక్కువగా ఉండటంతో మెగాస్టార్, రాజమౌళి దగ్గరుండి మరీ ఎడిటింగ్, గ్రాఫిక్స్ పనులు చూశారని వార్తలు వచ్చాయి. అంతేకాదు.. సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా ఈయన పాల్గొని ఆసక్తికరంగానే మాట్లాడారు.
RRR సినిమా రన్ టైమ్ కూడా మొదట 3:15 నిమిషాలు అనుకున్నప్పటికీ ఎందుకో సాహో, సైరా రెండు దగ్గరుండి చూసిన తర్వాత జక్కన్న జంకుతున్నారట. ఇంత సినిమాను జనాలు ఎలా బుర్రకెక్కించుకుంటారు..? ఇంత నిడివి అవసరమా..? అసలుకే ఎసరుపడితే పరిస్థితేంటని ఒకటికి పదిసార్లు ఆలోచించిన జక్కన్న ఫైనల్‌గా ఓ నిర్ణయానికొచ్చారట. సినిమాను 2:45 లేదా 2:50 గంటలు లోపే ముగించేయాలని ఇంతకుమించి ఇక లాగకూడదని నిర్ణయించుకున్నారట. వాస్తవానికి నాలుగు పాటలు అనుకున్నప్పటికీ ఈ నిడివి తగ్గించేందుకు గాను ఒక పాటను లేపేశారని తెలుస్తోంది. మొత్తానికి చూస్తే.. ‘సాహో’, ‘సైరా’ ఎఫెక్ట్‌తో జక్కన్న చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి మరి!