‘అల వైకుంఠపురంలో’ నుండి తొలి గీతం ‘సామజవరగమన’ విడుదల
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో...’ వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల అవటానికి ముస్తాబవుతోంది.
ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన టైటిల్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమాలోని తొలిపాట ‘సామజవరగమన’ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన ఈ పాటలోని లిరిక్స్ అద్భుతంగా ఉండగా.. పాటను పాడిన సిద్ శ్రీరామ్ వాయిస్ ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా సినిమాకు సంగీతం అందించిన థమన్.. పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఈ పాటతో తమ అనుభవాలను పంచుకున్నారు. వాటి వివరాల్లోకి వెళితే....
ఈ పాట గురించి సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. అల వైకుంఠపురంలో.. ‘అల్లు అర్జున్’ గారికి పాటలు చేయాలంటే చాలా కష్టం. చాలా ఆలోచించాలి. బన్నీ డాన్స్ చాలా బాగుంటుంది. తన కొరియోగ్రఫీ ఐడియాలు చాలా గట్టివి. ఇప్పటికే రేసుగుర్రం, సరైనోడు ఇలా బన్నీకి 12పాటలు చేశానని, ఇప్పుడు చేసేది ఇంకా కొత్తగా ఉండాలనే ప్రయత్నంలో ఈ పాటను రూపొందించినట్లు థమన్ చెప్పారు. త్రివిక్రమ్ సార్, సీతారామశాస్త్రి గారు. వాళ్లతో జర్నీ అంటే మాములు విషయం కాదు. ఎప్పుడూ కూడా ఫస్ట్ డే లా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా వారి ఆలోచనలు కొత్తగా ఉంటాయని, అందుకే వాళ్లకు ది బెస్ట్ ఇవ్వాలని అందులో కాంప్రమైజ్ కాలేదని థమన్ అన్నారు. ఇది వరకు చిత్రాలతో పోలిస్తే విభిన్నంగా సంగీతాన్ని అందించినట్లు చెప్పారు. మెలోడీ సాంగ్ అంటే దానికి ఎంతో సాధన చేయాలని, అందుకే ఈ సినిమాకు చాలా కొత్తగా చేశామని, నేచురల్ సౌండ్స్ తో చేశామని, పియానో, వయోలిన్, ఫ్లూట్.. ఇలా లైవ్ సౌండ్స్ పెట్టుకుని లిరిక్స్ కు తగ్గట్టుగా పాటను రూపొందించినట్లు వెల్లడించారు. పాపకు పేరు ఎంత ఇంపార్టెంటో.. లిరిక్స్ అంత ఇంపార్టెంట్ అని అటువంటి అధ్భుతమైన సాహిత్యం సీతారామశాస్త్రి గారు ఇచ్చారని, ఇందులో లిరిక్స్ ది బెస్ట్ అని థమన్ అన్నారు. అలాగే సిద్ శ్రీరామ్ పాటను చాలా బాగా పాడారు. అని ‘సామజవరగమన...’ అనే పదం మొత్తాన్ని కదిలించింది అని థమన్ అన్నారు. ఈ పాట కోసం 70మందికి పైగా పనిచేశారని చెప్పుకొచ్చారు. తనకు ఇటువంటి అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్ కి, అల్లు అర్జున్ కి, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సంధర్భంగా పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మాట్లాడుతూ.. ‘అల వైకుంఠపురంలో..’ సినిమాలోని పాట ‘సామజవరగమన..’ చాలా బాగా వచ్చిందని, ఈ పాటకు థమన్ చాలా చక్కగా సంగీతం అందించాడు అని అన్నారు. ఆర్కెస్ట్రా కూడా చాలా కష్టపడిందని అన్నారు. వైరుధ్యంగా.. కుర్రతనం.. తుంటరితనం.. కొంటెతనం ఉండే పాట రాయమని అడిగినప్పుడు కొన్ని క్లాసికల్ పదాలు రాయాలని అనిపించిందని, అందుకే కొన్ని పదాలను ఇందులో రాసినట్లు చెప్పారు. అటువంటి అవకాశం ఇచ్చినందుకు త్రివిక్రమ్ కు ధన్యవాదాలు అని తెలిపారు. సామజవరగమన అంటే అమ్మాయి గురించి వర్ణించే పదాలు అని, సామజవరగమన, మల్లెల మాసమా? విరిసిన పింఛమా..? దయలేదా? అసలు అంటూ రాసిన పాట సిద్ధ్ శ్రీరామ్ చాలా బాగా పాడాడని, ఆర్కెస్ట్రా కూడా చాలా బాగా ఏర్పాటు చేశాడు థమన్ అని అన్నారు. బన్నీ ఎటువంటి పాత్రలో అయినా చాలా చక్కగా ఒదిగిపోతాడని, ఓ మధ్యతరగతి కుర్రాడి పాత్రలో ఇందులో కూడా ఎంతో బాగా బన్నీ నటించాడని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అన్నారు. తనకు ఇటువంటి అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్, అల్లు అర్జున్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) లకు కృతజ్ఞతలన్నారు.
‘అల వైకుంఠపురములో’ని తారలు:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, రోహిణి, ఈశ్వరీరావు, కల్యాణి నటరాజన్, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, పమ్మిసాయి, రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు:
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్ - లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్, ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్, నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)