ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి- మెగాస్టార్ చిరంజీవి భేటీ నేపథ్యంలో ఓ వైపు పెద్ద ఎత్తున వార్తలు.. మరోవైపు సోషల్ మీడియా వేదికగా వైసీపీ వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య వివాదం చెలరేగిన విషయం విదితమే. సోషల్ మీడియాలో చిత్తూరు జిల్లా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభిమాన సంఘం పేరిట ఈ పోస్టులు వెలువడటంతో అసలేం జరుగుతోంది..? ఆయన దగ్గరుండి ఇలా చేయిస్తున్నారా.. ఏంటి..? అందరూ నిర్ఘాంతపోయారు. ఈ వివాదంపై ఎట్టకేలకు చెవిరెడ్డి మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చుకోవడంతో గొడవ సద్దుమణిగింది.
కుట్ర ఆలోచనలతో టీడీపీ తనపై దుష్ప్రచారం చేస్తోందని.. సోషల్ మీడియాలో చిరంజీవిపై పెట్టిన పోస్టింగ్‌లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెవిరెడ్డి చెప్పుకొచ్చారు. చెవిరెడ్డి అభిమాన సంఘం పేరిట సర్క్యులేట్ చేసిన వార్తలు అవాస్తవమేనని.. అసలు తనకు ఎలాంటి అభిమాన సంఘాలే లేవని తేల్చిచెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టింగ్‌లతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో అభిమాన సంఘాల పేరుతో ఎలాంటి అకౌంట్లు కూడా లేవని తేల్చిచెప్పారు. అంతేకాదు.. తన ఫ్యాన్స్ అసోసియేషన్ పేరిట సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పోస్టింగ్స్‌ను తక్షణమే తొలగించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వైసీపీ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.
చిరంజీవితో నాకు మంచి సంబంధాలే ఉన్నాయని.. ఈ మొత్తం పోస్టింగ్‌ల వెనుక తెలుగుదేశం పార్టీ నాయకుల కుట్ర దాగుందన్నారు. తాను తుడా (తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ ఆథారిటీ) చైర్మన్‌గా ఉన్న సమయంలో చిరంజీవి ఎమ్మెల్యేగా పని చేశారని.. నాటి నుంచి ఆయనతో మంచి సత్సంబంధాలే ఉన్నాయని చెవిరెడ్డి చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే చెవిరెడ్డి క్లారిటీ ఇవ్వడంతో ఇక్కడితో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడినట్లైంది.