తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, వెట్రి మారన్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘అసురన్’. దసరా కానుకగా అక్టోబర్ 4న విడుదలైన ఈ చిత్రం తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు.. ఇప్పటికే కలెక్షన్ల పరంగా రూ.100 కోట్లు దాటేసింది. ఈ సినిమాలో ధనుష్.. డబుల్ రోల్‌లో చేయగా.. ఈయన సరసన మంజువారియర్ నటించింది. ఈ సినిమా చూసిన పెద్ద పెద్ద స్టార్‌లు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తాజాగా.. తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘అసురన్’ సినిమా చూసిన టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు.. ‘సినిమా అద్భుతంగా ఉంది.. అసురన్ టీమ్‌కు కంగ్రాట్స్’ అని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చాడు. ఇక మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యాడు. అప్పట్నుంచి చెర్రీ మనసు ‘అసురన్’పై పడింది. దీంతో రీమేక్ హక్కులు సొంతం చేసుకునే పనిలో మెగా హీరో నిమగ్నమయ్యాడని టాక్ గట్టిగానే నడుస్తోంది.
ఇక సినిమా విషయానికొస్తే.. చెర్రీ నటించిన ‘రంగస్థలం’ తరహాలోనే ఉంటుందని.. ఇలాంటి నేపథ్యమున్న సినిమా తన అచ్చిరావడమే కాకుండా కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్ నిలిచిపోవడంతో.. ‘అసురన్’ రీమేక్‌క్ బాగా ఇంట్రస్ట్ చూపుతున్నాడట. అంతేకాదు.. ఈ సినిమా రీమేక్ చేస్తే ‘రంగస్థలం-2’ కావడం ఖాయమని.. ఇది కెరీర్‌లో మరో బెస్ట్ మూవీ అవుతుందని కొందరు రామ్‌చరణ్‌కు సలహాలిచ్చారట. ప్రస్తుతం దర్శధీరుడు జక్కన్న దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్‌లో చెర్రీ నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ‘అసురన్’ రీమేక్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే.