టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావించి చేసిన చిత్రం ‘సైరా’.. ఈ చిత్రం ఆశించిన దానికంటే ఎక్కువే హిట్టవ్వడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇంకా కాసులు రాలుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే తన తదుపరి సినిమా కొరటాల శివతో చేస్తున్నట్లు అధికారిక ప్రకటన రావడంతో పాటు కొబ్బరికాయ కూడా కొట్టేశారు. ఈ సినిమా తర్వాత మళయాల రీమేక్ ‘లూసీఫర్’ చిత్రంలో చిరు నటిస్తారని వార్తలు వచ్చాయి. ఇంతవరకూ అంతా ఓకే గానీ ఈ రెండు చిత్రాల్లోనూ రామ్ చరణ్ పాత్ర ఉంటుందని.. మరీ ముఖ్యంగా కొరటాల సినిమాలో ప్లాష్ బ్యాక్‌లో యంగ్ చిరుగా చెర్రీ నటిస్తారని వార్తలు వచ్చాయి. ఈ పుకార్లు, వార్తలన్నింటిపై తాజాగా చెర్రీ క్లారిటీ ఇచ్చుకున్నాడు.
ఇంకా ఏమీ అనుకోలేదు!
‘ఈ రెండు చిత్రాల్లో నేను నటిస్తున్నట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదు. ‘లూసీఫర్’ రీమేక్ హకులు కొన్న మాట మాత్రం వాస్తవమే. ఆ చిత్రంలో నేను లేను. అసలు ఈ చిత్రాన్ని ఎవరు తెరకెక్కించాలి అనేది ఇంకా ఏమీ అనుకోలేదు. ఆ డైరెక్టర్ ఎవరైనది త్వరలోనే అధికారికంగా ప్రకటన చేస్తాం’ అని రామ్ చరణ్ తెలిపాడు.
నేను రెడీ కానీ ఇంకా పిలుపు రాలేదు!
ఇక కొరటాల సినిమా విషయానికొస్తే..‘ప్రస్తుతం నాన్న కొరటాల శివ, త్రివిక్రమ్‌ల కథలు వింటున్నారు. అయితే కొరటాల సినిమాలో నాకు సెట్ అయ్యే పాత్ర ఉందో లేదో కూడా నాకు తెలియదు. కొరటాల ఈ పాత్ర విషయమై ఇంతవరకూ నాకు చెప్పలేదు. ఈ సినిమాలన్నీ నాన్నవి గనుక.. ఫలానా పాత్రలో చరణ్ ఉంటే బాగుంటుందని నాన్న, డైరెక్టర్ అనుకుంటే కచ్చితంగా నేను నటించడానికి రెడీ. నాకు కూడా కొరటాలతో సినిమా చేయాలని ఉంది.. ఆయన నాన్నతో సినిమా చేయాలని బలంగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాలకు డేట్లు ఇస్తానని ఆయనకు చెప్పాను’ అని చెర్రీ చెప్పుకొచ్చాడు.
ఇదీ కొత్త విషయం!
మొత్తానికి చూస్తే.. ఈ ఇంటర్వ్యూ వేదికగా చెర్రీ చెప్పిన ఓ ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఇప్పటి వరకూ కొరటాల సినిమా ఆ తర్వాత లూసీఫర్ అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే చిరుకు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథ చెబుతున్నాడని.. ఆయనతో సినిమా ఉంటుందన్న వార్తలు ఎక్కడా రాలేదు. అంటే.. కొరటాల సినిమా తర్వాత చిరును త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తారన్న మాట.