తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, వెట్రి మారన్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘అసురన్’. దసరా కానుకగా అక్టోబర్ 4న విడుదలైన ఈ చిత్రం తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు.. ఇప్పటికే కలెక్షన్ల పరంగా రూ.100 కోట్లు దాటేసింది కూడా. ఈ సినిమాలో ధనుష్.. డబుల్ రోల్‌లో చేయగా.. ఈయన సరసన మంజువారియర్ నటించి మెప్పించింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులే కాదు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఫిదా అయిపోయారు. ఇప్పటికే టాలీవుడ్‌లో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్‌కు ఈ సినిమాపై కన్నుపడింది!. మరోవైపు విక్టరీ వెంకటేష్ తెలుగులో ‘అసురన్’ రీమేక్ చేస్తారని ఇప్పటికే వార్తలు వచ్చాయి కూడా.
అయితే.. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్‌లో కూడా రీమేక్ చేయాలని భావిస్తున్నారట. ఇటీవలే ఈ మూవీ చూసిన బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌కు తెగ నచ్చేసిందట. అందుకే రీమేక్ చేసేస్తే పోలా అని అనుకున్నారట. అంతేకాదు ఈ మధ్య తనకు ఆశించినంతగా హిట్స్, సినిమాలు కూడా పెద్దగా లేకపోవడంతో ‘అసురన్’ రీమేక్ అచ్చొస్తుందని షారుక్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. విభిన్నమైన కథలను.. వైవిధ్య భరితమైన పాత్రలను ఎంచుకుని ప్రయోగాలు చేయడంలో షారూక్ ముందు వరుసలో ఉంటారన్న విషయం తెలిసిందే. అంటే కోలీవుడ్‌లో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్.. వయా టాలీవుడ్ మీదుగా ముంబై చేరుతోందన్న మాట.
రీమేక్ సినిమాలు చేయడం సినీ ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు.. ఏదైనా ఒక భాషలో వచ్చిన సినిమా బాగా హిట్టయితే అది రీమేక్ అవ్వాల్సిందే. మరీ ముఖ్యంగా కోలీవుడ్ సినిమాలు తెలుగులో.. తెలుగు సినిమాలు కోలీవుడ్‌లో ఎప్పట్నుంచో రీమేక్ అవుతూనే వస్తున్నాయ్. అయితే ఈ రీమేక్ మూవీస్ కొందరికి అచ్చిరాగా.. మరికొందరు హీరోలను జీరో చేశాయ్ కూడా. ఏదైతేనేం ధనుష్ సినిమాకు మాత్రం కోలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్, బాలీవుడ్‌లో బాగా డిమాండ్ పెరిగిందన్న మాట. నిజంగా షారూక్ నటిస్తే మాత్రం ఆయన అభిమానులకు పండుగేనేమో మరి!.