టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ బోయ సునీత వ్యవహారం ఇండస్ట్రీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ప్రముఖ నిర్మాత బన్నీవాసు మోసం చేశారని ఓసారి.. అబ్బే అదేం లేదని మరోసారి చెప్పుకొచ్చింది. అంతేకాదు.. తనకు ఆరోగ్యం సర్లేదని ట్రీట్మెంట్ చేయించాలని కూడా సదరు నిర్మాతను కోరింది. అయితే ఈ వ్యవహారం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)ఆఫీస్ మెయిన్ గేట్ వద్ద మొదలై కోర్టు దాకా చేరింది. ఈ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలించిన కోర్టు సునీత విషయంలో కీలక నిర్ణయమే తీసుకుంది.
సునీత మానసిక పరిస్థితి సరిగ్గా లేదని వెంటనే ట్రీట్మెంట్ చేయించాలని కోర్టు వారు ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు ఆమెను ట్రీట్మెంట్ నిమిత్తం ఓ ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆస్పత్రిలో సునీతకు వైద్యులు చికిత్స చేస్తున్నారని సమాచారం. అయితే ట్రీట్మెంట్ విషయంపై సునీత బోయ కుటుంబ సభ్యులు ఇష్టపూర్వకంగానే చేయిస్తున్నారని తెలియవచ్చింది. ఈ ట్రీట్మెంట్‌కు డబ్బులు ఎవరిస్తున్నారు..? బన్నీ వాసే భరిస్తున్నారా..? లేకుంటే వేరే చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏమైనా వైద్యం చేయిస్తున్నారా..? అనేదానిపై మాత్రం ఇంతవరకూ క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే ఈ ట్రీట్మెంట్ విషయమై సునీత తల్లిదండ్రులు మీడియాకు పంచుకోవడానికి వారు ఇష్టపడలేదట.