మెలోడీ క్వీన్ లతా మంగేష్కర్‌ను(90) అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఆమె అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని ఓ వైపు వైద్యులు.. మరోవైపు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే లతా తుదిశ్వాస విడిచారని రెండ్రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చేశాయి. అవన్నీ పుకార్లే అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. మరోవైపు వెబ్‌సైట్లు, యూ ట్యూబ్ చానెల్స్ కథనాలు వండి వార్చేశాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి.. లత కుటుంబ సభ్యులు చెవిన పడటంతో ఎట్టకేలకు ఈ వ్యవహారంపై స్పందించి పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టేశారు.
లతా కోలుకుంటున్నారు. చనిపోయినట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని అభిమానులు, ఆత్మీయులు నమ్మొద్దు. ఆ వార్తలన్నీ పూర్తిగా నిరాధారమైనవి. అమెరికాలోని క్లీవ్‌లాండ్ క్లినిక్‌కు చెందిన వైద్య బృందం చికిత్స అందిస్తోంది. ఆమె ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది’ కుటుంబ సభ్యులు, ఆర్పీజీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గొయెంకా తెలిపారు. ఇదిలా ఉంటే.. శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న లతాను బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు చికిత్స అందిస్తున్నారు. నవంబర్ 11 నుంచి ఐసీయూలో ఆమెకు ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది.
అయితే మొదట పరిస్థితి విషమించినప్పటికీ నిదానంగా ఆమె వైద్యానికి సహకరిస్తు్న్నారని ఇదివరకే వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు. కుటుంబ సభ్యులు క్లారిటీ ఇవ్వడంతో లతా అభిమానుల్లో నెలకొన్న ఆందోళన తొలగినట్లయ్యింది. సో.. ఇకనైనా ఇలాంటి వార్తలు రాయకుండా వెబ్‌సైట్లు మిన్నకుంటాయో లేకుంటే మరిన్ని పుకార్లు సృష్టిస్తాయో వేచి చూడాల్సిందే మరి.