తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న చిత్రం ‘తలైవి’. ఇందులో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ బాషల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల చెన్నైలో ప్రారంభమైంది.
అరవిందస్వామి ఇందులో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్) పాత్రలో నటిస్తున్నారు. అలాగే మరో లెజెండ్రీ పొలిటీషియన్, దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు.
శనివారం ఈ సినిమాలో జయలలితగా నటిస్తోన్న కంగనా రనౌత్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ను విడుదల చేశారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ను విడుదల చేశారు.
జయలలిత ఓల్డ్ గెటప్‌లో కంగనా రనౌత్ ఒదిగిపోయారు. అలాగే టీజర్‌లో జయలలితకు సంబంధించిన రెండు గెటప్‌లను విడుదల చేశారు. అందులో ఇండియన్ సినిమాలో స్టార్ హీరోయిన్ లుక్ ఒకటి కాగా.. తమిళనాడు ముఖ్యమంత్రి పాత్రకు సంబంధించిన లుక్ మరొకటి ఉంది.
విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ నిర్మిస్తున్నారు. బ్లేడ్ రన్నర్, కెప్టెన్ మార్వెల్ వంటి హాలీవుడ్ చిత్రాల్లో వర్క్ చేసిన ప్రముఖ హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ కంగనా రనౌత్‌ను జయలలితగా చూపిస్తున్నారు.