సంచలనాలకు కేరాఫ్ దర్శకుడు.. వివాదాలే ఊపిరి అంటున్న రామ్ గోపాల్ వర్మకు ఈ మధ్య వరుస ఎదురుదెబ్బలు ఎక్కువయ్యాయ్. వాస్తవానికి ఎదురుదెబ్బలు, గిల్లుడు, తిట్టుడు లేకపోతే ఈయనకు నిద్రపట్టదు. ఇక అసలు విషయానికొస్తే.. ఆర్జీవీ తెరకెక్కించిన వివాదాస్పద చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ రిలీజ్‌కు తెలంగాణ హైకోర్టు బ్రేకులేసిన విషయం విదితమే. అయితే రిలీజ్ ఎప్పుడు ఉంటుంది..? అసలు ఉంటుందా..? ఉండదా..? అనేదానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ఇవన్నీ అటుంచితే టికెట్లు కొన్న వర్మ వీరాభిమానులు, సినీ ప్రియుల పరిస్థితి మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.
ఇలా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోక మునుపే ఏపీ ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. బహుశా ఇలాంటి షాక్ వైసీపీ సర్కార్ నుంచి వస్తుందని ఆర్జీవీ ఊహించి ఉండడేమో. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా పేరును మార్చాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి.. రీజనల్ సెన్సార్ బోర్డు అధికారులకు లేఖ రాశారు. ఈ సినిమా టైటిల్‌లో రెండు కులాల పేర్ల ప్రస్తావన వస్తోందని.. తద్వారా ప్రజల్లో అలజడి వచ్చే అస్కారం ఉందని లేఖలో రాసుకొచ్చారు. ఇలా జరగకుండా ఉండాలంటే ఈ సినిమా టైటిల్‌ను మార్చాలని సదరు సెన్సార్ బోర్డు అధికారులను ఆయన కోరారు. దీంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఆర్జీవీ పరిస్థితి తయారైంది.
కాగా.. ఇప్పటికే తాను పేరు మార్చాడానికి సిద్ధంగా ఉన్నానని.. సెన్సార్ ఇప్పించాలని హైకోర్టును ఆర్జీవీ కోరిన విషయం విదితమే. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్‌ను ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’గా మారుస్తానని ఓ టీవీ చానెల్ డిబెట్‌లోనే ఆర్జీవీ ప్రకటించాడు. అయితే ఇలాంటి వివాదాలు, వరుస షాక్‌లు, ఎదురుదెబ్బలు ఆర్జీవీకి కొత్తేం కాదు.. మరి జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో యమా స్పీడ్ మీదుండే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో అనేది వేచి చూడాల్సిందే.