దుమ్ము రేపుతున్న ‘దర్బార్’ లో ‘దుమ్ము ధూళి’ పాట - పాటల రచయిత అనంత శ్రీరామ్
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ‘గజిని’, ‘స్టాలిన్’, ‘తుపాకీ’ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై భారీ నిర్మాణ వ్యయంతో, ఉన్నత సాంకేతిక విలువలతో ఎ. సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ తెలుగు నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇటీవల తొలి పాట ‘దుమ్ము ధూళి’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. రజనీకాంత్ ఇమేజ్ కి తగ్గట్టు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ స్వరపరిచిన, పాటల రచయిత అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ‘దుమ్ము ధూళి’ పాట... ఇంటర్‌నెట్‌లో దుమ్ము రేపుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ పాటకు ఇప్పటికి 8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సంగీతానికి, సాహిత్యానికి విశేష ప్రజాదరణ లభిస్తోంది. ఈ సందర్భంగా అనంత శ్రీరామ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన చెప్పిన సంగతులు...
తెలుగు ప్రేక్షకులందరికీ మనస్పూర్తిగా నమస్కరిస్తున్నాను. ఓ విధమైన సంతోషంలో, ఆనంద పారవశ్యంలో ఉన్న సమయమిది. కారణం ఏంటంటే... రజనీకాంత్ గారి దర్బార్ చిత్రానికి సంబంధించి మొట్టమొదటి పాట ‘దుమ్ము... ధూళి’కి తెలుగులో రెండు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. తెలుగు, తమిళ భాషల్లో మొత్తం 8 మిలియన్ల మంది ఈ పాట విన్నారు. రజనీకాంత్ గారి సినిమా అంటే మొదటి పాటకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ మొదటి పాటను రాసే అదృష్టం ఇంతకు ముందు ‘పేట’ చిత్రంలో నాకు వచ్చింది. అందులో ‘మరణం మాస్ మరణం’ పాటను రాశాను. అదే విధంగా... ‘దర్బార్’ చిత్రంలో ‘దుమ్ము ధూళి’ అన్న పాటను రాశాను.
ఎస్పీబీ గొంతు తోడవడంతో...
‘పేట’లో పాటను ఎస్పీ బాలసుబ్రమణ్యంగారు, అనిరుధ్ రవిచంద్రన్ కలిసి పాడితే... ‘దర్బార్’ లో పాటను ఎస్పీ బాలుగారు ప్రత్యేకంగా పాడారు. ఆయన పాట పాడటం అంటే... మనం సాహిత్యం ద్వారా పాటను 50 మెట్లు తీసుకువెళితే, ఇంకో 50 మెట్లు బాలుగారి కంఠం తీసుకువెళుతుంది. ఈ పాటకు సాహిత్యం, సంగీతం బాగా కుదిరాయి. బాలుగారి గొంతు తోడవడంతో పాట ఇంత ప్రజాదరణ పొందింది. సాహిత్యం, సంగీతం బావుంటే... అభిమాన తార అయ్యుంటే... అనువాద చిత్రం అని చూడకుండా పాటను విజయవంతం చేస్తారని తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు.
ఈ పాటలో ప్రయోగాలూ చేశా!
ఈ పాటలో మంచి మంచి ప్రయోగాలు చేయడం జరిగింది. ‘నలుపు రంగున్న సింహం వచ్చేసిండు’ అని! అలాగే, ‘ఇనుప రాడ్ అల్లే చేతులు కట్టుకు కూర్చుంటే తుప్పు పట్టి పోతావోయ్. అదే కనుక పని చేస్తుంటే నాలా ఎప్పుడూ యంగ్ గా ఉంటావ్’ అని రజనీగారితో సందేశం ఇప్పించాను. మాస్ పాట అయినప్పటికీ... కొన్ని సందేశాత్మక వాక్యాలు, అందరినీ ఉర్రూతలు ఊగించే వాక్యాలు ఈ పాటలో రాశాను. అందువల్ల, ‘దుమ్ము ధూళి’ పాట ఇంత విజయవంతం అయ్యింది.
రజనీగారికి వరుసగా పాటలు రాస్తున్నా!
రజనీకాంత్ గారి విషయానికి వస్తే... ఇంతకు ముందు ‘కథానాయకుడు’లో తొలిసారి ఆయనకు పాట రాశా. ఆ పాట పేరే ‘సూపర్ స్టార్’. అప్పుడు మంచి ప్రజాదరణ పొందింది. తర్వాత ‘విక్రమసింహా’, ‘2.0’, ‘పేట’ చిత్రాలకు పాటలు అందించాను. అన్నిటినీ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ముఖ్యంగా ‘2.0’లో ‘బుల్లిగవ్వ’, ‘ప్రియమవు ప్రియమవు బ్యాటరివే’ పాటలు. రజనీకాంత్ గారికి వరసగా పాటలు రాయడం నాకు చాలా సంతోషాన్నిస్తుంది.
దర్శకుడితో అప్పుడు చిరంజీవి గారికి... ఇప్పుడు రజనీకాంత్ గారికి!
ఈ చిత్రం గురించి చెప్పాలంటే... దర్శకులు మురుగదాస్ గారి గురించి చెప్పుకోవాలి. ఆయన చిత్రాలు, కథలు పరిశోధనాత్మకంగా ఉంటూ, ఎంతోకొంత విజ్ఞానాన్ని మనకు అందిస్తూ... వినోదాత్మక భాషలో ఉంటాయి. ఏదో నేను తెలివైనవాడినని చెప్పడానికి ఆయన ప్రయత్నించకుండా... కొత్త విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా చెప్తారు. ఆయన ఒక అద్భుతమైన పోలీస్ కథతో ‘దర్బార్’ తెరకెక్కించారు. ఆయన గత చిత్రాలు విజయవంతమైనట్టుగా, ఈ చిత్రం విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాను. నేను ఇంతకు ముందు మురుగదాస్ గారితో కలిసి ‘స్టాలిన్’ కి పని చేశా. చిరంజీవిగారి పరిచయ గీతం ‘పరారే పరారే’ రాశాను. అది కూడా మంచి విజయవంతమైంది. ఇప్పుడు ఈ ‘దర్బార్’ లో రజనీగారి పరిచయ గీతం విజయవంతమైంది. ఈ సంప్రదాయం ఇలాగే కొనసాగుతుందేమో చూడాలి. అంతా దైవేచ్ఛ.
నిర్మాతలు అందరినీ గౌరవిస్తారు!
లైకా ప్రొడక్షన్స్ సంస్థ వరుసగా రజనీకాంత్ గారితో సినిమాలు చేస్తున్నారు. అలాగే, చిన్న సినిమాలను ప్రోత్సహిస్తున్నారు. చాలామంచి నిర్మాతలు. సాంకేతిక నిపుణులను, నటీనటులను గౌరవించే నిర్మాతలు. వాళ్ళకు తెలుగులో మంచి విజయాలు రావాలనీ, ‘దర్బార్’ ద్వారా మరో సంచలనం వారి ఖాతాలో చేరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ప్రముఖ తెలుగు నిర్మాత ఎన్వీ ప్రసాద్ గారు ‘దర్బార్’ చిత్రాన్ని తెలుగు ప్రజలకు అందిస్తున్నారు. వారికీ ‘దర్బార్’ ద్వారా మంచి విజయం రావాలని, ఈ సంక్రాంతి వారికి నిజమైన పండగ తీసుకురావాలని కోరుకుంటున్నాను. ‘దర్బార్’ సంక్రాంతి మన ముందుకు వస్తుంది. ఆదరిద్దాం.
ఎప్పుడు అనువాద చిత్రాలకు పాటలు రాసినా, అవి మన పాటలే అని తెలుగు ప్రజలకు అనిపించే విధంగా సాహిత్యాన్ని అందించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను.
రజనీకాంత్ సరసన నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. హిందీ నటుడు సునీల్ శెట్టి, యోగి బాబు, తంబి రామయ్య, శ్రీమన్, ప్రతీక్ బబ్బర్, జతిన్ సర్న, నవాబ్ షా, దలిప్ తాహిల్ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి పి ఆర్ ఓ: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి, ఫైట్స్: పీటర్ హెయిన్, రామ్ లక్ష్మణ్, లిరిసిస్ట్: అనంత శ్రీరామ్, ఆర్ట్ డైరెక్షన్: టి సంతానం, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుందర్ రాజ్, సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్, సంగీతం: అనిరుద్ రవిచంద్రన్, నిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్, రచన దర్శకత్వం: ఏఆర్ మురుగదాస్, నిర్మాత: సుభాస్కరన్.