అవును మీరు వింటున్నది నిజమే.. బిగ్‌బాస్-3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌కు.. ఆణిముత్యాల్లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులని అలరించిన కృష్ణవంశీ బంపరాఫర్ ఇచ్చాడు. ఓహ్ సింగర్ కదా.. పాటలు పాడమని ఆఫరిచ్చారేమో అని అనుకుంటున్నారు.. అస్సలు కాదండోయ్ బాబూ.. ఓ పాత్రలో నటించడానికి మాత్రమేననట. ఇంతకీ ఏ సినిమాలో పాత్రకు రాహుల్‌ను ఆయన సంప్రదించాడు..? ఆయన సింగర్ కదా నటించడమేంటి..? ఈ పాత్రలో నటించడానికి రాహుల్ ఏమంటున్నాడు..? అనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్‌లో మిగతా డైరెక్టర్లతో పోలిస్తే ఈయన రూటే సపరేటు. ఈయన సినిమాల్లో ఎక్కువ శాతం కొత్తవారికి అవకాశమిచ్చి వారిని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. లాంగ్ గ్యాప్ తర్వాత ఈయన తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా సెట్స్ పైకి వెళ్లింది. విశాఖపట్నంలో చిత్ర షూటింగ్ జరుపుకుంటోంది. ప్రకాశ్ రాజ్ - రమ్యకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషిస్తుండగా, బ్రహ్మానందం ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. అయితే సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది.
అదేమిటంటే.. ఇప్పటివరకూ సింగర్‌గా కాస్తో కూస్తో గుర్తింపు తెచ్చుకుని.. తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 విన్నర్ అవ్వడంతో తన రేంజ్ పెంచుకున్న రాహుల్‌కు తన సినిమాలో పిలిచి మరీ కృష్ణవంశీ అవకాశమిచ్చాడు. అంటే ఇప్పటి వరకూ పాటలకే పరిమితమైన రాహుల్ ఇప్పుడు నటిస్తాడన్న మాట. ఇప్పటికే తనకు సినిమాల్లో నటించే అవకాశమొస్తే.. మరీ ముఖ్యంగా పునర్నవీ తాను కలిసి హీరో హీరోలుగా నటించాలని ఉందని మనసులో మాటను బయటపెట్టాడు. కొత్తవారిని ప్రోత్సహించినట్లుందని భావించిన కృష్ణవంశీ.. ‘రంమార్తాండ’లో రాహుల్‌కు ఓ పాత్ర అప్పజెప్పాడు. అంటే.. త్వరలోనే ఈ టాలీవుడ్ సింగర్ నటుడిగా అరంగేట్రం చేయబోతున్నాడన్న మాట.
నన్ను దీవించండి..!
ఈ విషయమై రాహుల్ స్వయంగా మాట్లాడుతూ.. పెద్దలైన ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం వంటి గొప్పనటులతో నటిస్తుండటం ఎంతో సంతోషంగా ఉందన్నాడు. సినిమాలో నటించే ఈ అవకాశాన్ని తనకు ప్రసాదించిన కృష్ణవంశీకి కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాదు.. ‘షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా..? అని ఎంతో ఆసక్తిగా నేను ఎదురు చూస్తున్నాను. నిజంగా నేనెంతో అదృష్టవంతుడ్ని.. నాకు మీ దీవెనలు కావాలి’ అని ట్విట్టర్ వేదికగా రాహుల్ కోరాడు. నటుడి కాని రాహుల్‌కే అవకాశాలు వచ్చాయ్.. మరి చేసింది ఒకే ఒక్క సినిమా అయినా పర్లేదు అనిపించుకున్న పున్నూ పరిస్థితేంటో.