ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు: దర్శక నిర్మాత శ్రీనివాసరెడ్డి
ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీనివాసరెడ్డి, సత్య, షకలక శంకర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. ఈ చిత్రం ద్వారా కమెడియన్, నటుడు వై. శ్రీనివాసరెడ్డి దర్శక నిర్మాతగా మారుతున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా డిసెంబర్ 6న విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత శ్రీనివాసరెడ్డితో ఇంటర్వ్యూ...
దర్శకుడిగా ఎలా? ఎందుకు మారారు?
- తక్కువ బడ్జెట్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ మూవీని ప్రొడ్యూస్ చేయాలని చాలా రోజులుగా అనుకునేవాడిని. అలాంటి సమయంలో నేను చేయాల్సిన ఓ సినిమా 20 రోజుల పాటు వాయిదా పడింది. ఆ సమయంలో నాతో జయమ్ము నిశ్చయమ్మురా సినిమా చేసిన పరం చెప్పిన పాయింట్ మీద కథను డెవలప్ చేశాం. కథ చాలా బాగా వచ్చింది. దాంతో సినిమా మా కమెడియన్స్ గ్రూప్ ఫ్లయింగ్ కలర్స్ బ్యానర్‌లో ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాను. అయితే చాలా మంది కమెడియన్స్ వస్తే కొత్త దర్శకుడు హ్యాండిల్ చేస్తాడో లేదోననిపించింది. అందుకనే నేనే సినిమాను డైరెక్ట్ చేయాలని అనుకున్నాను. నేను దర్శక నిర్మాతగా చేయబోయే సినిమా గురించి మా ఆర్టిస్టులకు చెప్పగానే తమ నుండి ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామని అన్నారు. నేను వారికి ఎలాంటి రెమ్యునరేషన్స్ ఇవ్వలేదు. ఓన్ రిలీజ్ చేస్తుండటం వల్ల రిలీజ్ తర్వాతే డబ్బులు తీసుకుంటామని అందరూ అన్నారు. అలా నేను ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ సినిమాకు డైరెక్టర్‌గా మారాను.
మీరే దర్శక నిర్మాత అన్నారుగా విమర్శలు వస్తాయేమోనని అనుకోలేదా?
- సినిమా ఎలాగో ఉంటుందని అనుకుని చేయలేదు. ముందుగా నాకున్న నాలెడ్జ్‌లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయగలమని భావించి రాసుకున్న కథ. ప్రీ వర్క్ బాగా చేశాం. నేను, పటేల్ అనే రైటర్, ఎంటర్‌టైన్‌మెంట్ సబ్జెక్ట్‌పై నమ్మకంగా ఉన్నాం. ఈ కథను విన్నవాళ్లెవరూ ఎందుకులే అన్నా! కథలో అంత దమ్ములేదు అనలేదు. ఇంట్లోవాళ్లకి కూడా కథ వినిపించాను. అనిల్ రావిపూడిగారికి కూడా కథ వినిపించాను. ఆయనకు బాగా నచ్చింది. జాగ్రత్తగా చేసుకుంటే బావుంటుందనే సలహా ఇచ్చారందరూ. మన విజువలైజేషన్ వేరుగా ఉంటుంది. ప్రాక్టికల్‌గా వేరుగా ఉంటుంది. అన్ని ఓ ప్రాసెస్‌లా నేర్చుకుంటూ వచ్చాను. దిల్‌రాజుగారు, ట్రైలర్ కట్ చేసిన సలహాలు నాకు బాగా హెల్ప్ అయ్యాయి. ఇంత మంది ఆర్టిస్టులతో ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడం అంత సులభమైన విషయం కాదు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. ఆసాంతం ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతారు.
మెయిన్ పాయింట్ ఏంటి?
- సర్వైవల్ ప్రాబ్లమ్ ఒకరికి, మరొకరికి లాటరీ టికెట్స్ పిచ్చి ఉంటుంది. ఇలా ఎంటర్‌టైనింగ్‌గా సినిమా సాగుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన చాలా విషయాలను మా సినిమాలో ఎంటర్‌టైనింగ్ వేలో చెప్పాం. ఉదాహరణకి శివాజీగారి ఆపరేషన్ గరుడవేగ ఉంది. దాన్ని శివాజీగారు ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం బావుంది. దాన్ని మా సినిమాలో ఉపయోగించుకున్నాం. ఓంకార్‌గారి వన్ మినిట్ సీన్ ఉంది. సృజన, ప్రియాప్రకాష్, బ్రతుకు ఎడ్లబడ్లలాంటి సీన్, రసగుల్లాలాంటి సీన్స్ ఇలా ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఒకరోజులో జరిగే కథ ఇది. దేన్ని మిస్ చేయకూడదని తొలి సన్నివేశాన్ని మా నాన్నగారిపై తీశాను. సినిమాను పూర్తి చేసిన తర్వాత ఆయన కన్నుమూశారు. మా నాయనకు డబ్బింగ్‌ను మహర్షి సినిమాలో రైతు పాత్ర చేసిన గురుస్వామిగారు చెప్పారు. మాదక ద్రవ్యాల ముఠాను ఓ పోలీస్ ఆఫీసర్ పట్టుకోవాలనుకుంటే దాంట్లోకి మేం ఎలా ఇరుక్కున్నామనేదే కథ. నేను, సత్య, షకలక శంకర్ ప్రధానంగా నటించాం.
అంత మంది నటీనటులను ఎలా హ్యాండిల్ చేశారు?
- అందరూ నా స్నేహితులే కావడంతో ఓ సన్నివేశంలో నటించారు. వాళ్లు కూడా కొన్ని ఇంప్రవైజేషన్స్ చెప్పారు. అవి నచ్చితే చేసుకుంటూ వెళ్లాం. షాట్ డివిజన్ కూడా చేశాం. హైదరాబాద్ సిటీలోనే ఎక్కువ షూటింగ్ చేశాం. ఓ దశలో ఈ కథలోని క్యారెక్టర్స్ రోడ్ల పైకి వచ్చేస్తాయి.
ఈ కథకు ఇన్‌స్పిరేషన్ ఉందా?
- పర్టికులర్ ఇన్‌స్పిరేషన్ అంటూ ఏమీ లేదు. ఉదాహరణకు రాంగోపాల్ వర్మగారి క్యారెక్టర్‌ను వెన్నెల కిషోర్‌గారికి ఇంప్లిమెంట్ చేశాం.
మీ మేనల్లుడు పాత్ర ఎలా ఉంటుంది?
- మా మేనల్లుడు సుజిత్, ఇందులో మంచి పాత్రలో కనపడతాడు. డగ్స్ర్‌కి బానిసైన యువకుడిగా కనపడతాడు. యూత్‌కు వెళ్లాల్సిన మెసేజ్ తన ద్వారానే వెళుతుంది.
దర్శక నిర్మాతగా చేయడం వల్ల మీరు సినిమాలు మిస్ అయ్యారని అనుకుంటున్నారా?
- ఆర్టిస్ట్, దర్శకుడు, నిర్మాత రోల్స్‌లో నాకు ఆర్టిస్ట్‌గా ఉండటమే ఇష్టం. ఈ సినిమా కోసం దర్శక నిర్మాతగా మారడం వల్ల సరిలేరు నీకెవ్వరు చేయలేకపోయాను. అయితే మహర్షి సినిమా కోసం గ్యాప్ తీసుకెళ్ళి నటించాను. ఆర్టిస్ట్‌గా ఇప్పటి వరకు ఎంజాయ్ చేశాను. డైరెక్టర్‌గా నేనేం చేశాననేది నాకు తెలుసు. ఆర్టిస్ట్‌గా ఎక్కడా ఆగే సమస్య లేదు. ఆల్ రెడీ నటుడిగా నాలుగైదు సినిమాలను కమిట్ అయ్యాను.
ప్రస్తుతం నటుడిగా చేస్తున్న సినిమాలేవీ?
- బాలకృష్ణగారి ‘రూలర్’లో నటించాను. కల్యాణ్‌రామ్, మల్లిడి వేణు కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమాలో నటించబోతున్నాను. మరికొన్ని డిస్కషన్స్ ఉన్నాయి. ఇక డైరెక్టర్‌గా చూస్తే.. నేను బేసిగ్గా కమెడియన్‌ని కాబట్టి డైరెక్టర్‌గా కూడా ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికే ప్రయత్నిస్తాను.
సినిమా మేకింగ్‌లో ఎలాంటి సపోర్ట్ లభించింది.. ఫీడ్ బ్యాక్ ఎలా ఉంది?
- సినిమా తెరకెక్కించిన తర్వాతే కాదు..ముందు నుండి చాలా కాన్ఫిడెంట్‌గానే ముందుకెళ్లాం. అందరూ తమ వంతు సపోర్ట్ చేశారు. ట్రైలర్ చూసి రాజమౌళిగారు ట్వీట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ట్రైలర్ విడుదల చేసిన వరుణ్ తేజ్‌గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను. సినిమా పూర్తయిన తర్వాత దిల్‌రాజుగారు, శిరీష్‌గారు, మా కుటుంబ సభ్యులు అందరూ ఈ సినిమాను చూశారు. అందరికీ సినిమా బాగా నచ్చింది.