శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై గణేష్ కొల్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘హల్‌చల్’. రుద్రాక్ష, ధన్య బాలకృష్ణ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి రిలీజ్ చేసారు.
ఈ సందర్భంగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ.. ట్రైలర్ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది, ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా సినిమా చూస్తారు. ట్రైలర్ తనకు కూడా చాలా నచ్చింది అని ఇలాంటి వినూత్నమైన కథతో వస్తున్న దర్శక నిర్మాతలకు హీరో హీరోయిన్ ఆర్టిస్టులకు, టెక్నిషియన్స్ కు శుభాకాంక్షలు తెలిపారు. సినిమా పెద్ద హిట్టు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.
నిర్మాత గణేష్ కొల్లూరి మాట్లాడుతూ మూడు సంవత్సరాలు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. ఈ సినిమా ఎమ్.ఎస్.కె డిజిటల్ ద్వారా మల్కాపురం శివకుమార్‌గారు రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నటించిన నటీనటుల, సాంకేతిక నిపుణుల సమిష్టి కృషితో అద్భుతంగా తెరకెక్కించాము. ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించి మా సినిమాను విజయంతం చేస్తారని ఆశిస్తున్నాను.. అని తెలిపారు.
హీరో రుద్రాక్ష్ మాట్లాడుతూ హీరోగా తొలి పరిచయం అవుతున్న నాకు మంచి కథతో కూడిన సినిమా దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను, నాకు హీరోగా అవకాశం కల్పించిన నిర్మాత గణేష్ కొల్లూరి గారికి మరియు మా అభ్యర్థన మన్నించి మా సినిమా ట్రైలర్ లాంచ్ చేసిన నా మిత్రుడైన డైరెక్టర్ సందీప్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.
దర్శకుడు శ్రీపతి కర్రి మాట్లాడుతూ ఒక కొత్త కథతో వచ్చిన నాకు నిర్మాత గణేష్‌గారు డైరెక్టర్‌గా అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. ఇది ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాము అన్నారు.