టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. సీనియర్ అయినా జూనియర్లతో అయినా చాలా కూల్ మింగిల్ అయిపోతుంటాడు. ఇప్పటికే పలువురు పెద్ద హీరోలు.. చిన్న హీరోలతో కలిసి ఆయన నటించారు. తాజాగా.. విక్టరీ వెంకటేశ్, తన మేనల్లుడు యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కలిసి ‘వెంకీమామ’ చిత్రంలో కలిసి నటించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 13న విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో తాజాగా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెంకీ వెల్లడించాడు.
యంగ్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేయాలనుందని.. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలనుందని మనసులోని మాటను బయటపెట్టాడు. అయితే ఎన్టీఆర్‌తోనే ఎందుకు చేయాలనుందనే దానికి కూడా కారణాలు చెప్పుకొచ్చాడు వెంకీ. ఎన్టీఆర్ యాక్టింగ్ స్టైల్‌ను, డాన్సింగ్ స్టైల్ అంటే బాగా ఇష్టమని.. మంచి కథ కుదిరితే ఆయనతో కలిసి నటించాలనుందని వెంకీ చెప్పాడు.
కాగా.. ‘వెంకీమామ’ తర్వాత వెంకీకి చాలా ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. ‘అసురన్’ రీమేక్, ఇటీవలే ఆకుల శివ చెప్పిన కథ ఇలా ఒక్రటెండు రెడీగా ఉన్నాయి. అంతేకాదు అసురన్ కంటే ముందుగా ఆకుల శివ.. సురేష్ బాబుకు కథ చెప్పగా బాగుందని కితాబిచ్చారట. ఈ మల్టీస్టారర్ కథకు నేచురల్ స్టార్ నానీ అయితే సరిగ్గా సెట్ అవుతారని భావిస్తున్నారట. ఈ క్రమంలో వెంకీ మాత్రం తనకు ఎన్టీఆర్‌తో కలిసి నటించాలని ఉందని చెప్పాడు. అయితే అసురన్ కాకుండా ఆకుల శివ చెప్పిన కథ వర్కవుట్ అయితే మాత్రం ఎన్టీఆర్-వెంకీ కలిసి నటించినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో మరి.