ధర్మ సూర్య పిక్చర్స్ పతాకంపై పొలిటికల్ సెటైర్‌గా రూపొందుతోన్న ఎమోషనల్ డ్రామా ‘జోహార్’. భాను సందీప్ మార్ని నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకుడు. జోహార్ చిత్ర యూనిట్ తాజాగా జోహార్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్‌లో తాజా రాజకీయ మరియు సాంఘిక పరిణామాలని ఎత్తి చూపుతూ, విగ్రహ రాజకీయం కాళ్ళ కింద నలిగిపోయిన 5 జీవితాల కథనాలే ఇతివృత్తంగా సాగించిన ఎమోషనల్ డ్రామా జోహార్ అని తెలుస్తుంది.
ఈ సందర్భంగా దర్శకుడు తేజ మార్ని మాట్లాడుతూ.. ‘‘నేను ప్రముఖ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మగారి వద్ద ‘వంగవీటి’ చిత్రానికి దర్శకత్వశాఖలో, అలాగే ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌గారి వద్ద రచనా విభాగంలో పనిచేశాను. డైరెక్టర్‌గా నా తొలి చిత్రం ‘జోహార్’. పొలిటికల్ సెటైర్‌గా రూపొందిస్తూ ఐదు పాత్రల చుట్టూ అద్భుతంగా తిరిగే ఎమోషనల్ డ్రామాగా దీన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకు రావాలనుకుంటున్నాను. ప్రస్తుతం చిత్ర షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫస్ట్ లుక్ నుండి ఊహించిన దానికంటే మా చిత్రంలో చాలా కంటెంట్ ఉంది. అందుకే విజయంపై మా యూనిట్ మొత్తానికి పూర్తి నమ్మకముంది’’ అన్నారు.
‘దృశ్యం’ చిత్రంలో వెంకటేశ్ కూతురిగా నటించిన ఈస్తర్ అనిల్, ‘వంగవీటి’ ఫేమ్ నైనా గంగూలీ, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈశ్వరీరావు, రోహిణి, శుభలేఖ సుధాకర్, చైతన్యకృష్ణ తదితరులు ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా చిత్ర కథనం ప్రకారం వారణాసి, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ వంటి ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది.