రష్మిక.. ఈ పేరుకు ఇప్పుడో బ్రాండ్ ఉంది.. జూనియర్‌లు మొదలుకుని సీనియర్లు.. సూపర్‌స్టార్‌లతో సినిమా తీయాలంటే మొదట పూజా హెగ్దే పేరు.. సెకండ్ వినిపించేది రష్మిక మందన్నా.! అలా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుందీ భామ. అలా సినిమాల్లో మంచి క్రేజులో ఉన్న టైమ్‌లో లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఆ ముద్దుగుమ్మ భావించింది. ‘కిరిక్ పార్టీ’ సినిమాలో రక్షిత్ సరసన రష్మిక కలిసి నటించింది. ఆ సినిమా టైమ్‌లోని ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి అది కాస్త పెళ్లి దాకా వెళ్లింది.! అటు రష్మిక ఇంట్లో.. ఇటు రక్షిత్ ఇంట్లో ఒప్పుకోవడంతో నిశ్చితార్థం కూడా అయిపోయింది. అయితే ఏం జరిగిందో ఏమో బయటికి మాత్రం రావట్లేదు కానీ.. వీళ్లిద్దరూ ప్రేమ పెళ్లి పీటలు దాకా వెళ్లలేదు.
పెళ్లి రద్దయిన విషయమై ఎన్నెన్నో పుకార్లు షికార్లు చేశాయ్. రష్మిక మరొకరితో డేటింగ్‌లో ఉందని అందుకే పెళ్లి రద్దయ్యిందని కూడా వార్తలు గుప్పుమన్నాయ్. అయితే ఆ తర్వాత ఈ విషయమై స్పందించి ఆ పుకార్లు అన్నీ ఉత్తుత్తే అని కొట్టి పారేసింది. తాజాగా.. అసలు బ్రేకప్ కారణాలేంటి..? ఎందుకు రద్దు అయ్యింది..? అనే విషయాలను రక్షిత్ కాస్త చెప్పే ప్రయత్నం చేశాడు. ‘అతడే శ్రీమన్నారాయణ’ అనే సినిమా ప్రమోషన్‌లో రక్షిత్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రష్మిక ప్రస్తావన రాగా ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
ఆమె గతం నాకు తెలుసు!
‘రష్మికకు చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. ఆమె గతంలో ఎలా ఉండేదో నాకు బాగా తెలుసు. కాబట్టి ఆ కలలు కూడా ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలుసు. ఆమె కన్న కలలు అన్నీ నిజం కావాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ప్రేమ, బ్రేకప్, పెళ్లి.. అనేవి జీవితంలో చిన్న చిన్న విషయాలే. జీవితం మనకు చాలా రకాల అనుభవాలను పరిచయం చేస్తుంది. అన్నింటినీ ఎదుర్కొని ముందుకు వెళ్లాలి. అలా మనకు ఎదురైన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడమే మనం చేయాల్సిన పని’ అని రష్మిక గురించి ప్రస్తావిస్తూ రక్షిత్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. ఈ సందర్భంగా రష్మికకు క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలిపాడు. కాగా.. రక్షిత్ వ్యాఖ్యలపై రష్మిక ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.