టాలీవుడ్‌లోని ఇప్పుడున్న కుర్ర హీరోలంతా సినిమాల్లో నటించడమే కాదు.. నిర్మించేస్తున్నారు కూడా. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని మంచి క్రీజ్‌లో ఉన్నప్పుడే చేయాల్సిన వన్నీ చేసేయాలని.. ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కుర్ర హీరోలు భావిస్తున్నారు. అందుకే సినిమాల్లో ఓ వైపు నటిస్తూనే మరోవైపు బిజినెస్‌లు చేస్తున్నారు. అయితే ఈ బిజినెస్‌లు కొందరికి కలిసిరాగా.. మరికొందరు అట్టర్ ప్లాప్ అయ్యి లాక్కోలేక.. పీక్కోలేక తలకిందపెట్టి తపస్సు చేస్తున్నారు!. ఒక కుర్ర హీరోలే కాదు.. హీరోయిన్స్ సైతం ఈ మధ్య ఎక్కువగా బిజినెస్ బాటే పడుతున్నారు. ముఖ్యంగా నిర్మాణంవైపే ఎక్కువగా ఆసక్తిగా చూపుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చేరినట్లు గత కొన్నిరోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయ్.
బ్యానర్ పేరు ఫిక్స్..!
త్వరలోనే సొంత నిర్మాణ సంస్థను స్థాపించబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సంక్రాంతికి లేదా ‘RRR’ షూటింగ్ పూర్తయిన తర్వాత నిర్మాణ సంస్థ స్థాపించాలని ఫిక్స్ అయిపోయాడట. ఇక సినిమాల్లో నటించడమే కాదు నిర్మించాలని గట్టిగా అనుకున్నాడట. ఇప్పటికే ఆ నిర్మాణ సంస్థకు తన తండ్రి హరికృష్ణ, కుమారుల పేరు రెండూ కలిసొచ్చేలా ఓ మంచి పేరు సెలెక్ట్ చేయాలని సూచించగా.. ‘భార్గవ్ హరి ప్రొడక్షన్స్’ అని సూచించారట. అయితే మరికొందరు మాత్రం ‘అభయహరి ఆర్ట్స్’ అని సూచించినట్లు తెలుస్తోంది.
మిత్రుడు, డైలాగ్ వల్లేనా!?
ఎన్టీఆర్‌కు క్లోజ్ ఫ్రెండ్ అయిన రామ్‌చరణ్ సలహా మేరకే ఎన్టీఆర్ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి నందమూరి ఫ్యామిలీకి సంబంధించి బ్యానర్లు చాలానే ఉన్నాయి. అయితే తాను ప్రత్యేకంగా వేరు కుంపటి పెట్టుకోవడానికి కొన్ని కారణాలున్నాయట. ‘జై లవకుశ’ డైలాగ్ ఉంది కదా.. ‘పదవిలో మనవాళ్లు ఉండటం వేరు.. మనమే ఉండటం వేరు’ అన్నట్లుగా.. ‘మనవాళ్లకు బ్యానర్ ఉండటం వేరు.. మనకే బ్యానర్ ఉండటం వేరు’ అని గట్టిగా అనుకున్న ఎన్టీఆర్.. సొంత బ్యానర్ నిర్మించుకోవాలని ఫిక్సయ్యారట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే బుడ్డోడు రియాక్ట్ అయ్యే వరకూ వేచి చూడాల్సిందే.